హరీశ్ రావు బంధువులపై మియాపూర్ లో కేసు నమోదు!
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం అందరిని ఆకర్షిస్తోంది.
మాజీ మంత్రి హరీశ్ రావుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తాజాగా ఆయనకు దగ్గర బంధువుల మీద ట్రెస్ పాసింగ్ కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం అందరిని ఆకర్షిస్తోంది. హరీశ్ రావుకు దగ్గరి బంధువులైన ఆరుగురు మీద ట్రెస్ పాస్.. చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అక్రమంగా వచ్చి ఉంటుననారంటూ బాధితుడు దండు లచ్చిరాజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో కేసు నమోదుచేశారు.
హరీశ్ రావు తమ్ముడు.. మరదలు.. మేనమామతో పాటు మరో ముగ్గురిపైనా కేసులు నమోదయ్యాయి. ఫాస్మో హాస్పిటాలిటీ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకొని చీటింగ్ కు పాల్పడ్డారంటూ బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తన ఇంటిని తనకు తెలీకుండానే హరీశ్ రావు బంధువులు అమ్మేశారని ఆరోపించారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని పేర్కొన్నారు.
బ్లాంక్ చెక్.. బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకొని మోసానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. తన ఆస్తి కోసం తాను 2019 నుంచి పోరాడుతున్నట్లుగా బాధితుడు పేర్కొన్నారు. బాధితుడు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో హరీశ్ బంధువులైన తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వరరావు.. గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి.. జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై కేసు నమోదు చేసినట్లుగా మియాపూర్ పోలీసులు వెల్లడించారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు సైతం స్పందించలేదు. ఆయన వివరణతో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే వీలుందనే మాట వినిపిస్తోంది.