వైద్యం కోసం రూ.1.50 లక్షలు మరణిస్తే రూ.2 లక్షలు కేంద్రం కొత్త పథకం

ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Update: 2025-01-08 15:30 GMT

రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని గ్రహించిన కేంద్రం క్షతగాత్రుల చికిత్సకు ‘నగదు రహిత వైద్యం’ అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకంపై కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టమైన ప్రకటన చేశారు.

ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలతోపాటు ఇతర రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు తక్షణమే చికిత్స పొందడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ సమస్య వల్ల కూడా మరణాల రేటు పెరుగుతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్యం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం చండీఘడ్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.

ఈ పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు రహిత వైద్యం చేస్తారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వుంటుంది. బాధితులకు వారం పాటు చికిత్సకు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు వెచ్చిస్తుంది. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షలు చెల్లించనుంది.

గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది మరణించారు. దీనిపై గతంలోనే మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మరణాలు ఎక్కువవుతున్నాయని గడ్కారీ అభిప్రాయపడ్డారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో సుమారు 30 వేల మంది హెల్మెట్లు ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రహదారులు లిఖిస్తున్న మరణ శాసనంలో ఎక్కువ మంది 18 నుంచి 34 ఏళ్ల వయసులో ఉన్న యువకులే ఉంటున్నారు. అంతేకాకుండా పాఠశాలల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సుమారు 10 వేల మంది పిల్లలు మరణించారు. ఈ సంఘటనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి గడ్కారీ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News