వివేకా హత్యలో అసలు నిజం అలా బయటకు వచ్చింది.. సీఎం చంద్రబాబు

అంతా అనుకున్నట్లు తొలుత గుండెపోటుతోనే వివేకానందరెడ్డి చనిపోయారని భావించామని, వివేకా కుమార్తె పోస్టుమార్టం చేయాలని కోరడంతో అసలు విషయం వెలుగు చూసిందని సీఎం నాటి సంఘటనలను ప్రస్తావించారు.;

Update: 2025-03-11 12:54 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ తన చేతిలో కత్తిపెట్టి కథనం రాశారని గుర్తుచేసిన సీఎం.. అప్పట్లో ఎన్నికల హడావుడిలో బిజీగా ఉండిపోవడం వల్ల ముందుగా ఏం జరిగిందో తెలుసుకోలేకపోయానని చెప్పారు. అధికారులు, పోలీసులు అంతా తొలుత గుండెపోటే అనుకున్నారని, కానీ వివేకా కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని కోరడంతోనే అసలు నిజం బయటపడిందనన్నారు.

మంగళవారం అసెంబ్లీలో వివేకా హత్య కేసు ప్రస్తావనకొచ్చింది. దీంతో గతంలో జరిగిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి గుర్తుకు తెచ్చుకున్నారు. తాను ఎన్నికల హడావుడిలో ఉండటంతో తొలుత వివేకా హత్యపై అర్థం కాలేదని అన్నారు. అప్పటి హోంమంత్రి, డీజీపీ, స్థానిక అధికారులు అందరిదీ అదే పరిస్థితి అని చెప్పారు. అంతా అనుకున్నట్లు తొలుత గుండెపోటుతోనే వివేకానందరెడ్డి చనిపోయారని భావించామని, వివేకా కుమార్తె పోస్టుమార్టం చేయాలని కోరడంతో అసలు విషయం వెలుగు చూసిందని సీఎం నాటి సంఘటనలను ప్రస్తావించారు.

ఇక రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసేవారు తప్పించుకోలేరని, భూకబ్జాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు లేని వాతావరణం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఠాల కుమ్ములాటలు ఇక చెల్లవని, రాష్ట్రంలో రౌడీలు ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. ప్రధానంగా వివేకా హత్య కేసులో సాక్షులు, కీలక వ్యక్తులు వరుసగా మరణిస్తుండటంతో సీఎం తాజా వ్యాఖ్యలు ఇంట్రస్టింగుగా మారాయి.

Tags:    

Similar News