బయటప్రపంచంలోకి వచ్చిన బాబు... జైలు వెలుపల తొలిపలుకులివే!

అనంతరం మైకందుకున్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు తనపై చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

Update: 2023-10-31 11:50 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టైన ఆయనకు ఆరోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.

దీంతో... టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సమయంలో... నారా లోకేశ్‌, బ్రాహ్మణి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, కంభంపాటి రామ్మోహన్‌ రావు, ఏలూరి సాంబశివరావు, జవహార్, బుచ్చయ చౌదరి, టి.డి.జనార్దన్‌ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు.

అనంతరం మైకందుకున్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు తనపై చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు మద్దతు తెలుపి, రోడ్లపైకి వచ్చి సంఘీభావం ప్రకటించి, పూజలు చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని తెలిపారు.

సైబర్‌ టవర్స్‌ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. తన విధానాల వల్ల లబ్ధిపొందిన ఐటీ ఉద్యోగులంతా ఆ కార్యక్రమంలో పాల్గొని వివరించారు అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా... తన 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎలాంటి తప్పుచేయలేదని చెప్పడం గమనార్హం!

ఇదే క్రమంలో... తనకు సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలకు, నేతలకూ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా స్వఛ్చందంగా బయటకు వచ్చి ఓపెన్ గా తన మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ కి ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు! ఇదే క్రమంలో జనసేనతోపాటు బీజేపీ, సీపీఐ, బీఆరెస్స్, కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం తనకు సంఘీభావం ప్రకటించారని చెబుతూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అయితే... రేపటి (బుధవారం) వరకూ మీడియాతో మాట్లాడొద్దని ఏపీ హైకోర్టు చంద్రబాబును ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బయటకు రాగానే మైకందుకోవడం.. అందరికీ థాంక్స్ చెప్పడంతోపాటు గత 45ఏళ్లలో తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పుచేయలేదని పేర్కనడం వంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది! మరోపక్క... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కినట్లే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!!

Full View
Full View

Tags:    

Similar News