అమరావతిపై త్రిముఖ వ్యూహమే.. కరెక్ట్!!
అయితే.. ఈ క్రమంలో చంద్రబాబు కృషి ఎలా ఉన్నా.. ముందుగా.. అమరావతి.. అందరిదీ! అనే భావన కల్పించాల్సిన అవసరం ఉంది.
నవ్యాంధ్రకు దివ్యమైన రాజధానిగా అమరావతి నిర్మాణం సాగాలని.. పదికాలాల పాటు పదిలంగా ఈ నగరం దేశంలోనే కాదు.. ప్రపంచస్థాయిలోనే భాసిల్లాలని సీఎం చంద్రబాబు కలలు కంటున్నారు. వీటిని సఫలం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు సమీకరించడంతోపాటు.. పెట్టుబడుల ద్వారా కూడా నిధులు తెచ్చి నగరాన్ని సాధ్యమైనంత వేగంగా నిర్మించేందుకు ప్రయత్నా లు ముమ్మరంగా సాగుతున్నాయి.
అయితే.. ఈ క్రమంలో చంద్రబాబు కృషి ఎలా ఉన్నా.. ముందుగా.. అమరావతి.. అందరిదీ! అనే భావన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి గాను త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది. నిజానికి రాష్ట్రంలో అందరూ అమరావతిని తమదే అనుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్న మాట. కానీ, గత వైసీపీ ప్రభుత్వం నాటిన కొన్ని వ్యతిరేక విష బీజాలు.. అమరావతిపై కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేక భావనను పెంచేలా చేసింది. అమరావతి అంటే.. కేవలం ఒక కమ్మ కులానికి చెందిన నగరమని.. వారి కోసమే.. ఇక్కడ నగరాన్ని నిర్మిస్తున్నారని.. గతంలో వైసీపీ సభా ముఖంగా ప్రచారం చేసింది.
ఈ భావనను చంద్రబాబు తొలిగించాలి. అమరావతి అందరిదీ.. అన్ని సామాజిక వర్గాలదీ.. అనే భావనను పెంపొందించాలి. అదేసమయంలో అమరావతిని కేవలం కొందరు ధనికులకు మాత్రమే పరిమితం చే యరాదన్నది మేధావులు సూచన. ఎందుకంటే.. పేదలకు కూడా.. రాజధాని సొంతమనే భావన పెరగాలి. అప్పుడు ఉపాధి కల్పనకు.. నగరం చేదోడు అవుతుంది. లేకపోతే.. రాజధాని అమరావతి అంటే.. పెట్టుబడిదారులకు మాత్రమే సొంతం అనే వాదన బలపడుతుంది.
అదేసమయంలో ఒకే చోట అభివృద్ది కేంద్రీకృతం అయినా.. ఇబ్బందే. గతంలో హైదరాబాద్ మారిగా.. పరిస్థితి మారుతుంది. సో.. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం అమరావతికి ఉన్నప్పుడు.. దీనిని అందరి రాజధానిగా తీర్చిదిద్దాలి. ఇతర ప్రాంతాలకు కూడా.. ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలను కూడా పంపించాలి. అంటే.. ఒకవైపు సామాజికంగా.. మరోవైపు ఆర్థికంగా.. ఇంకోవైపు ప్రాంతీయంగా కూడా.. అమరావతిపై తీసుకునే ప్రతి చర్చ.. ఆచి తూచి ఉండాల్సి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.