వాలంటీర్లకు బాబు మద్దతు... కానీ...!?
ఇది రాజ్యాంగేతర వ్యవస్థ అని నాలుగున్నరేళ్ల పాటు విమర్శించిన టీడీపీ దాని అధినేత చంద్రబాబు ఇపుడు వాలంటీర్లకు మద్దతు అని అంటున్నారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ బలంగా పాతుకునిపోయింది ఎవరు అవునన్నా కాదన్నా వారు వ్యవస్థలో భాగం అయ్యారు. వారు ప్రతీ యాభై ఇళ్ళకు ప్రతినిధిగా మారారు. ఇది రాజ్యాంగేతర వ్యవస్థ అని నాలుగున్నరేళ్ల పాటు విమర్శించిన టీడీపీ దాని అధినేత చంద్రబాబు ఇపుడు వాలంటీర్లకు మద్దతు అని అంటున్నారు.
అనంతపురం జిల్లా పర్యటనలో వాలంటీర్లకు పూర్తి మద్దతుగా బాబు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మంచి చేస్తామని ఆయన చెప్పారు. అంతే కాదు వారి మేలు కోరేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్ల వేతనాన్ని పెంచే విషయం మాత్రం ఆయన ప్రకటించేలేదు.
ఇదిలా ఉంటే టీడీపీ అధినాయకత్వమే వాలంటీర్ల మీద గతంలో ఎన్నో విమర్శలు చేసింది. వారిని ఇళ్లలోకి రానీయవద్దు అని కూడా పేర్కొంది. ఇక వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా టీడీపీ మిత్ర పక్షం కూడా మాట్లాడింది. వాలంటీర్ల వ్యవస్థ మీద ఇన్ని రకాలుగా మాట్లాడిన తరువాత ఇపుడు మేము వారికి ఫుల్ సపోర్ట్ అని చంద్రబాబు అంటున్నారు. అయితే దీనిని వాలంటీర్లు ఎంతవరకూ నమ్ముతారు అన్నది చూడాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే వాలంటీర్ల జీతం అయిదువేలు, ఇటీవల జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా దానిని ఆరు వేలకు చేశారు.
గౌరవ వేతనం అని చెబుతున్నారు. మరో వైపు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వారి వేతనం ఇంకా పెంచుతామని వైసీపీ అంటోంది. వాలంటీర్లు వైసీపీ తోనే వచ్చారు. ఒక విధంగా ఈ వ్యవస్థ సృష్టి కర్త వైసీపీ. ఆ కృతజ్ఞత భావం వారిలో మెజారిటీ సెక్షన్ కి ఉంటుంది అన్నది ఒక విశ్లేషణ.
మరో వైపు చూస్తే వాలంటీర్ల ఆత్మగౌరవం దెబ్బతీసేలా విపక్షాలు గత కాలమంతా విమర్శలు చేసీ తీరా ఎన్నికల ముందు మేము వారిని బాగా చూసుకుంటామంటే ఎంతవరకు నమ్ముతారు అన్నది కూడా ఆలోచించాలి అంటున్నారు. ఒక సిస్టమ్ కి వాలంటీర్లు అలవాటు పడిపోయారు. వారు వైసీపీ ప్రభుత్వంతో సెట్ అయి ఉన్నారు.
ఆ ప్రభుత్వం అందించే పధకాలు వారి విధానాలకు ట్యూనప్ అయిపోయి ఉన్నారు. ఇక చూస్తే వాలంటీర్లలో అత్యధిక శాతం యువతీ యువకులుగా ఉన్నారు. వారంతా మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు. ఆ దిశగా ఎవరైనా భరోసా ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ మద్దతు అని ఊరుకుంటే మాత్రం అది వర్కౌట్ కాదని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో భాగమై ప్రయాణం చేస్తున్న వాలంటీర్లు ఇపుడు ఎన్నికల వేళ టీడీపీ వైపు మళ్ళే అవకాశాలు అయితే తక్కువ. కానీ అదే సమయంలో చంద్రబాబు నోటి వెంటా ఈ రకంగా స్టేట్మెంట్ రావడం వైసీపీకి రాజకీయంగా మేలు జరుగుతుందని అంటున్నారు. జగన్ దార్శనీకుడు అని కూడా ఆ పార్టీ చెప్పుకునేందుకు వీలు ఉంటుంది.
వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వమే బాగా చూసుకుంటే అపుడు టీడీపీ ప్రభుత్వం అవసరం ఏముంది అన్న కొత్త చర్చ కూడా వస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకపోవడం వల్ల వచ్చిన చిక్కు ఇదే అని అంటున్నారు. అన్నింటికీ ఒకే గాటకు కట్టేసి విమర్శలు చేయడం వల్ల ఎన్నికల వేళ నాలిక కరచు కోవాల్సి వస్తుంది.
వాలంటీర్లకు ఇస్తున్నది అతి తక్కువ వేతనం. లక్షల కోట్ల బడ్జెట్ తో ప్రభుత్వాలు నడుస్తున్న వేళ వారి కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. పాలన కూడా గ్రాస్ రూట్ లెవెల్ కి వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ ని వైసీపీ పట్టుకుంది. ఇపుడు టీడీపీ అనుసరిస్తామని చెప్పినా అది పెద్దగా వర్కౌట్ కాదనే అంటున్నారు. అంతే కాదు తాము అధికారంలోకి వస్తే వైసీపీ పెట్టిన పధకాలు తీసేయమని చెప్పినా అది అధికార పార్టీ చేసిన మంచి పనికి సర్టిఫికేట్ ఇచ్చి వారికి పాజిటివిటీ పెంచేది అవుతుంది తప్ప విపక్షానికి మైలేజ్ రాదు అన్నది ఒక విశ్లేషణ.
ఏది ఏమైనా ఆరోపణలు చేసేటపుడు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇపుడు ఇలాంటి సీన్ రాదు అని అంటున్నారు. ఎవరు మంచి చేసినా బాగుంది అనాలి. లేకపోతే తాము అన్న దానికే కట్టుబడిపోవాలి. అమరావతి వేస్ట్ అని వైసీపీ ప్రభుత్వం అంటోంది. ఆ మాటకే వారు కట్టుబడిపోయారు. టీడీపీ మాత్రం తన విమర్శల మీద విధానాల మీద పిల్లి మొగ్గలు వేస్తోంది. మరి ఈ తేడాను కూడా జనాలు చూస్తారు కదా అని అంటున్నారు. నా సైన్యం అని జగన్ వాలంటీర్ల గురించి చెప్పుకుంటున్నారు. వారిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ కొత్త ఎత్తుగడలతో వెళ్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.