వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు... ఎఫెక్ట్ ఎవరిపై పడనుంది?

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు విధించింది.

Update: 2024-03-30 17:43 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అత్యంత ఆసక్తికరమైన టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. పైకి ఎన్ని చెబుతున్నా.. విపక్షాలకు కూడా వాలంటీర్ల విషయంలో లోలోన ఒకరకమైన ఆందోళన ఉండనే ఉందని చెబుతుంటారు. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు, దిద్దుబాటు చర్యలు ఈ కోవలోకే వస్తాయని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు విధించింది.

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా... ఎటువంటి సంక్షేమ పథకాలకూ వాలంటీర్ల చేత డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో... ఈ కోడ్ ప్రభావం వాలంటీర్లపై పడింది! ప్రభుత్వ సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు నేరుగా అందజేసేందుకు ఈ వ్యవస్థను రూపొందించిన సంగతి తెలిసిందే.

అయితే... ఈ సేవలు ఓటర్లపై ప్రత్యక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య, నిమ్మగడ్డ రమేష్ లు ఎన్నికల కమిషన్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీంతో... ఈ పిటిషన్ లపై స్పందించిన ఎన్నికల కమిషన్... ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వాలంటీర్లపై తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా... సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ ముగిసేవరకూ వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లను, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఈ క్షణం నుంచే అమలు కానున్నట్లు తెలిపింది. ఇదే సమయమంలో... సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించింది.

దీంతో... ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇచ్చే పెన్షన్ ను వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అందించే అవకాశం లేదు! జూన్ 4 ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వాలంటీర్ల సేవలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... ప్రధానంగా ఏప్రిల్, మే నెలల్లో పించన్లను ఎలా అందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ ఎఫెక్ట్ ఎవరిపై పడుతుందో అనే చర్చ కూడా మొదలవ్వడం గమనార్హం!

Tags:    

Similar News