ఆ కోట్ల సిమ్ కార్డులపై కేంద్రం సంచలన నిర్ణయం..!!
ఈ సమయంలో ఈ సైబర్ నేరాలపై కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రకరకాల మార్గాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను, విద్యార్థులను, రిటైర్డ్ అయిన వారినీ.. వారూ వీరూ అనే తారతమ్యాలు లేకుండా.. ఈ సైబర్ నేరాల బారిన పడేస్తున్నారు. ఈ సమయంలో ఈ సైబర్ నేరాలపై కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అవును... ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీటిని అదుపుచేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నకిలీ పత్రాలు సమర్పించి పొందిన, సైబర్ క్రైమ్ లలో ప్రమేయం ఉన్న సిమ్ కార్డులను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో... కేంద్రం ఆ చర్యలకు ఉపక్రమిస్తే సుమారు 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు కానున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో.. 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి! దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే జరిగితే సైబర్ నేరాలకు బలమైన చెక్ పెట్టినట్లే అని అంటున్నారు.
ఇటీవల బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఈ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ.), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఐటీ శాఖలకు చెందిన అధికారులు.. ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులతో కేంద్ర మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది.
అయితే.. ఈ సమావేశంలో కనెక్షన్స్ రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలికాం శాఖ సమర్పించిందని అంటున్నారు. ఇదే సమయంలో... సిమ్ కార్డులు జారీ చేసేటప్పుడు నో యువర్ కస్టమర్ (కేవైసీ)ని సమర్ధవంతంగా అమలుచేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. కాగా... భారతీయ నెంబర్ల మాదిరిగా కనిపించే ఇంటర్నేషనల్ కాల్స్ ను కూడా బ్లాక్ చేయాలని కొన్ని నెలల క్రితం టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.