ఎంపీలకు మంచి ఛాన్స్.. మిస్ చేసుకుంటారా..!
తాజాగా ఎంపీ లాడ్స్ నిధులను కేంద్రం పెంచింది. అయితే.. ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా.. నిర్ణయించడం గమనార్హం.
సహజంగా ఒక ఎంపీ తన నియోజకవర్గం వరకు ఆధిపత్యం చూపించడంలో తప్పులేదు. అయితే.. సాధారణంగా.. నియోజకవర్గం స్థాయిలో ఉన్న ఏడుగురు అసెంబ్లీ సభ్యులతో కలుపుకొని పోయి.. పనులు చేయించగలిగితే.. ఆ రేంజ్ ఎంపీకి ఆధిపత్యం తీసుకువస్తుంది. వైసీపీ హయాంలో పనులు చేయించే ప్రయత్నం చేసినా.. ఎంపీలకు కరోనా ఎఫెక్ట్ బాగానే తగిలింది. రెండేళ్లపాటు ఎంపీ లాడ్స్‌ను కేంద్రం నిలిపివేసింది. దీంతో ఎక్కడా వారు పనులు చేయించలేక పోయారు.
కానీ, ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే.. తాజాగా ఎంపీ లాడ్స్ నిధులను కేంద్రం పెంచింది. అయితే.. ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా.. నిర్ణయించడం గమనార్హం. ఇప్పటి వరకు ఏటా.. 25 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం దీనిని 35 కోట్లకు పెంచుతూ నిర్ణయించింది. ఇది ఎంపీలకు బలమైన సపోర్టనే చెప్పాలి. రాష్ట్రాలు అభివృద్ధి నిధులు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. ఎంపీలకు కేంద్రం ఇచ్చే నిధులతో పనులు చేసుకునేందుకు తమ సత్తా చూపించేందుకు కూడా అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 21 మంది కూటమి లోక్‌సభ సభ్యులే ఉన్నారు. వీరందరికీ ఏటా 35 కోట్ల రూపాయల వరకు.. ఒక్కొక్కరికీ ఎంపీ లాడ్స్‌ను కేంద్రం ఇవ్వనుంది. ప్రస్తుతం జరుగుతున్నది తొలి ఏడాదే కావడంతో వచ్చే ఐదేళ్లపాటు.. ఏటా 35 కోట్ల వరకు నిధులు అందనున్నాయి. వీరు ఆయా నిధులను ఖర్చు చేస్తే.. నియోజకవర్గాలను అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. తద్వారా రాజకీయంగా కూడా దూకుడు పెంచే అవకాశం ఉంటుంది.
కానీ, ఇప్పుడు కావాల్సింది.. సమన్వయం.. సఖ్యత. ఎందుకంటే.. స్థానికంగా ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే తో ఎంపీ కలివిడిగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా కూటమి పార్టీల ఎంపీలు-ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కనిపించడం లేదు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీ ఒక పార్టీ అయితే.. ఎమ్మెల్యేలు మరో పార్టీలో ఉన్నారు. వీరంతా సమన్వయంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పొరపాట్లు జరిగితే.. పనులకు నిధులు వచ్చినా.. ముందుకు సాగే అవకాశం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.