తిరుమలలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్... కీలక నిర్ణయం!

పైగా లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం వైరల్ గా మారిన పరిస్థితి!

Update: 2025-01-19 04:24 GMT

గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా తిరుమల వరుస వివాదాలకు కేరాఫ్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ ముహూర్తాన్న లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకి తెచ్చారో.. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో తిరుమలలో ఏమి జరుగుతుంది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. పైగా లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం వైరల్ గా మారిన పరిస్థితి!

ఈ సమయంలో తిరుమలలో ఇటీవల అనేక వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ వినని అపచారాలు, దారుణాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. తిరుమల మాడ వీధుల్లో పొలిటికల్ ఫైట్లు, ఫోటో షూట్ లు.. పరకామణిలో చోరీలు.. నకిలీ టిక్కెట్ల స్కామ్ లు! వీటితో పాటు అన్యమత ప్రచారాలకు సంబంధించిన వార్తలు!

ఇక.. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విక్రయ కేంద్రాల వద్ద జరిగిన ఘటన యావత్ దేశాన్ని షాకింగ్ కి గురిచేసింది. ఈ తొక్కిసలాట ఘటనలో 6గురు భక్తులు చనిపోగా.. సుమారు 40 మందివరకూ గాయపడిన పరిస్థితి. దీనిపై దేశవ్యాప్తంగా స్వామివారి భక్తులతో పాటు కేంద్ర ప్రభుత్వమూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోపక్క లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం టెన్షన్ పెట్టింది.

ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ.. అవి చాలదన్నట్లు తాజాగా తిరుమల కొండపై ఎగ్ పలావ్ లభించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోపక్క.. కడప చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాత్విక్ శ్రీనివాసరాజు (3) ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి పడిపోయాడు! ఇలా వరుసగా తిరుమలలో జరుగుతున్న ఘటనలపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

అవును... గత కొన్ని రోజులుగా తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ఆదేశించిందని అంటున్నారు! ఇదే సమయంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక అధికారిని పంపుతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. టీటీడీ చరిత్రలో ఇలా కేంద్రం జోక్యం చేసుకుని, పరిశీలన కోశం ప్రత్యేక అధికారిని పంపడం ఇదే తొలిసారనే మాటలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News