ఈసారి ఏపీ నుంచి ఎందరో కేంద్రమంత్రులు...!
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ లింగం అని ముతక సామెత ఉంది. రాజకీయ నేతలకు ఆ సామెత కరెక్ట్ గా సరిపోతుంది
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ లింగం అని ముతక సామెత ఉంది. రాజకీయ నేతలకు ఆ సామెత కరెక్ట్ గా సరిపోతుంది. వారికి ఆశలు ఎక్కువ. అలాగే వాటిని నెరవేర్చుకోవాలన్న ఆరాటం కూడా ఎక్కువ. అందుకే ఎన్నికల ముందు అన్ని లెక్కలనూ పక్కాగా చూసుకుని మరీ పార్టీలు మారుతూంటారు.
ఈసారి గాలి ఈ పార్టీకి ఉంది అందులో బెర్త్ దొరికితే అయిదేళ పొలిటికల్ జర్నీ సాఫీగా సాగిపోతుంది అని భావిస్తూంటారు. ఇపుడు చూస్తే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వస్తుంది అని ఒక అంచనా ఉంది. దాంతో 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం అపుడే ఏపీలో సందడి పెరిగిపోయింది. దీన్నే ఆలూ లేదు చూలూ లేదు అని అంటారేమో.
అందరి కంటే ముందుగా జనసేన అధినేత ఏపీ నుంచి అయ్యే తొలి కేంద్ర మంత్రి ఎవరో చెప్పేశారు అని ప్రచారం సాగుతోంది. తన సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారు అని పవన్ పార్టీ జనాలతో అన్నారు అన్నది సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ నుంచి ఏపీ కోటాలో నాగబాబు కేంద్ర మంత్రి అని పవన్ ముందే కర్చీఫ్ వేశారు అని అంటున్నారు.
ఇదే లిస్ట్ లో చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ముందు సొంత పార్టీ బీజేపీ నుంచి చూస్తే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కేంద్ర మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆమె విశాఖ లేదా రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని పొత్తులలో గెలిస్తే కేంద్ర మంత్రి అవడం ఖాయమని అంటున్నారు.
అదే వరసలో ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన రాజం పేట నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగితే గెలుపు ఖాయమని నమ్ముతున్నారు. గెలిస్తే కనుక మాజీ సీఎం హోదాలో కేంద్రంలో కీలక శాఖలతో క్యాబినెట్ మంత్రి కావడం ఖాయమని అనుచరులు అంటున్నారు.
ఇక టీడీపీ బీజేపీ పొత్తులో ఉంటే ఆ పార్టీకి కూడా కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయి కదా. ఆ లిస్ట్ లో శ్రీకాకుళం నుంచి రెండు సార్లు ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఈసారి విజయం దక్కితే కేంద్రంలో మంత్రి అవుతారు అని టీడీపీలోనే టాక్ నడుస్తోంది. అలా నాలుగవ కేంద్ర మంత్రి ఈయన అన్న మాట.
ఈ నలుగురూ కాకుండా ఇంకా చాలా మంది కేంద్ర మంత్రుల జాబితాలో ఉంటారు అని తెలుస్తోంది. ఏపీ నుంచి 2019 2024 మధ్యలో ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు. ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరూ లేరు. టీడీపీతో పొత్తు లేదు, జనసేనకు ఒక్కరే ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. అప్పట్లో వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని ప్రచారం సాగినా జరగలేదు.
కానీ ఇపుడు ఆ కొరత తీర్చేలా చాలా మంది మేమంటే మేము కేంద్ర మంత్రులమని అంటున్నారు. అయితే బీజేపీ కేంద్రంలో నెగ్గాలి. ఇపుడు వినిపిస్తున్న పేర్లు కలిగిన వారు అంతా గెలవాలి. ఏపీ మీద బీజేపీ ఉదారత చూపించి ఇన్నేసి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి. అపుడు కదా ఈ సరదా అంతా తీరేది అని సెటైర్లు పడుతున్నాయి.