వచ్చారు-వెళ్లారు... పీ-4 పదనిసలు!
పేదలను ధనవంతులుగా మారుస్తామని.. ఇది గొప్ప అవకాశమని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు చేస్తు న్న ప్రయోగంలో కీలక అంశం.. పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్‌షిప్) ద్వారా.. ఆయా కుటుంబాల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేయాలన్నది ఆయన లక్ష్యం.;

పేదలను ధనవంతులుగా మారుస్తామని.. ఇది గొప్ప అవకాశమని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు చేస్తు న్న ప్రయోగంలో కీలక అంశం.. పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్‌షిప్) ద్వారా.. ఆయా కుటుంబాల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేయాలన్నది ఆయన లక్ష్యం. ఇది తన జీవిత లక్ష్యం కూడా అని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇది సాకారం అయితే.. చాలు ఇక, తాను సంతృప్తిగా కూడా ఉంటానని ప్రకటించారు.
ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట పీ-4 కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి.. రెండు కుటుంబాలను కూడా ఎంచుకున్నారు. దీనికి మేఘా కృష్ణారెడ్డి కూడా సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఇది జరిగి రెండు రోజులు అయినా.. ఇప్పటి వరకు.. ఉన్నతస్థాయి వర్గాల నుంచి స్పందన లేకుండా పోయింది. నిజానికి సీఎంవోలో పీ-4 సమన్వయా నికి ప్రత్యేకంగా ఒక ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు.
అధికారులను కూడా నియమించారు. పేదలను ఆదుకునేందుకుముందుకు వచ్చే వారిని ఆదర్శమూర్తు లుగా పేర్కొంటూ..రాష్ట్ర అతిథుల గౌరవాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీనికి ప్రధానంగా.. మూడు కారణాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యల విషయంలోనే ఉన్నతస్థాయి వర్గాలు వెనుకంజ వేస్తున్నాయన్నది వారి మాట.
1) ఇప్పటికే ఉన్న కార్పొరేట్ రెస్పాన్స్ స్కీమ్. దీనిని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకంలో 80 డి. కింద సంస్థలకు కార్పొరేట్ పన్నుల్లో మినహాయింపు ఉంటుంది.
2) పీ-4లో సాయం చేసినా ఎలాంటి ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల మినహాయింపు లేక పోవడం.
3) తాము పేదలకు సాయం చేసినా.. తమకు సంబంధించిన సమస్యల పరిష్కారం.. భూముల వితరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట విధానం ప్రకటించకపోవడం.
ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. పీ-4 సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. అయితే.. వీటిని అమలు చేస్తే.. రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడంతోపాటు.. ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంటుందన్న లెక్క కూడా ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. పీ-4 కార్యక్రమానికి వచ్చిన వారు వచ్చి వెళ్ళారే తప్ప.. స్పందించకపోవడం గమనార్హం.