అలా వైఎస్సార్ ని వదిలేసిన బాబు

చంద్రబాబు వైఎస్సార్ లది ఒక విధమైన అనుబంధం. తమిళనాడులో అలా ఇద్దరు మిత్రులు ఉండేవారు.

Update: 2024-09-29 03:34 GMT

చంద్రబాబు వైఎస్సార్ లది ఒక విధమైన అనుబంధం. తమిళనాడులో అలా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఎంజీఆర్ కరుణానిధి. ఆ విధంగా చంద్రబాబు వైఎస్సార్ ఇద్దరూ కూడా రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించారు. ఒక పార్టీలో కొనసాగారు. ఇద్దరూ ఒకేసారి మంత్రులు అయ్యారు.

ఇలా సాగిన వారి రాజకీయ జీవితం తెలుగుదేశం ఏర్పాటుతో చీలిక వచ్చినట్లు అయింది. మామ ఎన్టీఆర్ పార్టీలో చేరిన బాబు వైఎస్సార్ కి రాజకీయంగా ప్రత్యర్ధి అయ్యారు. ఈ ఇద్దరు మిత్రులలో బాబే ముందుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏకంగా తొమ్మిదేళ్ల పాటు పాలించాక అపుడు వైఎస్సార్ పాలన మొదలైంది.

ఇక్కడ వైఎస్సార్ 2004 నుంచి 2009 దాకా అయిదుంపావు ఏళ్ళ పాటు సీఎం గా వ్యవహరించారు. ఆ సమయంలో అయిదేళ్ల పాటు ఆయన తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే వైఎస్సార్ కూడా క్రిస్టియన్ అయి ఉండి డిక్లరేషన్ ఇవ్వలేదని అంటారు.

మరి వైఎస్సార్ కి దోస్త్ గా ఉన్న చంద్రబాబుకు ఆయన మతం ఆయన విశ్వాసాలు ఆయన పద్ధతులు అన్నీ తెలుసు. అయినా అనాడు వైఎస్సార్ తిరుమల వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కోరుతూ ఆ ఇష్యూని వివాదంగా చేయలేదు. అసలు డిక్లరేషన్ చేయాలన్నది కూడా ఒక పెద్ద సమస్య అవుతుందని ఎవరూ తలవలేదు.

ఇక జగన్ 2009లో తొలిసారి తిరుమలకు వెళ్లారు. అపుడు ఆయన ఎంపీగా ఉంటూ డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీవారిని దర్శించుకున్నారని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఒక డిబేట్ లో చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది.

ఈ రెండు విషయాలూ ఎందుకు అంటే జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్న దాని మీదనే. మొదటి సారి ఎవరైనా కొండ మీదకు వెళ్తే విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇస్తారు పదే పదే వెళ్తున్న వారు అందునా సీఎం గా అయిదేళ్ల పాటు స్వామికి అతి ముఖ్యమైన బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుని అయిదున్నర కోట్ల ప్రజల తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చిన వ్యక్తిగా జగన్ నుంచి డిక్లరేషన్ కోరడం కచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యమే అని వైసీపీ నేతలు అంటున్నారు

అదే సమయంలో వైఎస్సార్ ని ఎందుకు డిక్లరేషన్ అడగలేదని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. తనకు మిత్రుడు అని ఆయన అలా వదిలేశారా లేక మతాన్ని రాజకీయాలోకి తెచ్చి సున్నితమైన అంశాలను కెలకకూడదు అని ఆలోచించారా అన్నది అర్థం కాని విషయమే. ఏది ఏమైనా జగన్ విషయంలోనే ఇన్ని కండిషన్లు పెడుతున్నారు అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్ లో స్నేహితుడిని చూసిన బాబు జగన్ ని ఆ స్నేహితుడి కొడుకుగా చూడడం లేదా అన్నది మరో చర్చ. అయితే వైఎస్సార్ బాబుల మధ్య వేవ్ లెంగ్త్ లో సామీప్యం ఉంది.

ఇద్దరూ ఒకే వయసు వారు. మిత్రులు. కాబట్టి అలా నడచిపోయింది. జగన్ అయితే బాబుని ప్రత్యర్థిగా చూస్తూ వచ్చారు. ఆఖరుకు బాబుకు జైలు గోడలను సైతం చూపించారు. దాంతోనే బాబు కూడా మారిపోయారు అని అన్న వారూ ఉన్నారు మొత్తం మీద చూస్తే సున్నితమైన అంశాలు రాజకీయాల్లోకి జొప్పించకపోవడమే మేలు అన్నది మేధావుల్తో పాటు అందరి మాటగా ఉంది.

Tags:    

Similar News