వంగవీటికి బాబు ఇచ్చిన హామీ ఏంటి ?
అయితే 2024కి ముందు కూడా అలాంటి ఊగిసలాటే ఆయన వైపు కనిపించిందని అన్నా ఆయనకు నారా లోకేష్ చంద్రబాబు ఇచ్చిన భరోసాలతో టీడీపీకే ప్రచారం చేసి పెట్టారు.
వంగవీటి మోహన రంగా తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ ప్రజారాజ్యం వైసీపీ మీదుగా టీడీపీ గూటికి చేరిన వంగవీటి రాధాకు రాజ్య యోగం అయితే దక్కడం లేదు. 2004లో గెలిచిన ఎమ్మెల్యే పదవి తప్ప రెండు దశాబ్దాల కాలంలో మళ్లీ ఆయన చట్టసభల్లో అడుగు పెట్టలేదు.
అధికారంలోకి వచ్చే పార్టీ నుంచి ఆయన చివరి నిముషంలో తప్పుకోవడమే ఒక కారణంగా చెబుతారు. 2019లో వైసీపీ గెలుస్తుంది అనుకున్నపుడు రాధా కాస్తా టీడీపీలోకి జంప్ చేశారు. అయితే 2024కి ముందు కూడా అలాంటి ఊగిసలాటే ఆయన వైపు కనిపించిందని అన్నా ఆయనకు నారా లోకేష్ చంద్రబాబు ఇచ్చిన భరోసాలతో టీడీపీకే ప్రచారం చేసి పెట్టారు.
ఇక టీడీపీ గెలిచింది. ఆరు నెలల కాలం గడచింది. వంగవీటికి పదవి ఏదీ అన్నది ఆయన అభిమానుల ఆవేదనగా ఉంది. వంగవీటిని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేస్తారు అన్నది అప్పట్లో వినిపించిన మాట. అందుకోసమే కేబినెట్ లో ఒకే ఒక ఖాళీని ఉంచారు అని అనుకున్నారు. కానీ ఇపుడు ఆ ఖాళీ నాగబాబుతో భర్తీ చేస్తున్నారు.
దాంతో వంగవీటి అనుచరులలో కలవరం రేగుతోంది. ఈ కేలక సమయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వంగవీటిని పిలిపించుకుని మంచి హామీనే ఇచ్చారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. నాగబాబుకు మంత్రి పదవిని ఫిక్స్ చేసిన నేపధ్యంలో చంద్రబాబు వంగవీటి రాధాను స్వయంగా పిలిపించుకుని మాట్లాడారని అంటున్నారు.
ఆయనకు వచ్చే మార్చి నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒక దానిని కచ్చితంగా ఇచ్చి శాసనమండలికి నామినేట్ చేస్తామని బాబు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం గట్టిగా సాగుతోంది. రానున్న కాలమంతా ఎమ్మెల్సీ పదవుల జాతరే అని టీడీపీలో వినిపిస్తున్న మాట. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. చైర్మన్ నిర్ణయం మీద వారి రాజీనామాలు ఆధారపడి ఉన్నాయి. అక్కడ క్లియర్ అయితే ఆ స్థానాలలో ఖాళీలు వస్తాయి. వచ్చే మార్చిలో మరో అయిదు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇలా చూస్తే కనుక ఎమ్మెల్సీ పదవులు అన్నీ టీడీపీతో పాటు కూటమికే దక్కడం ఖాయం.
దాంతో ఆశావహులు అంతా ఒక వైపు టీడీపీలో ఈ పదవుల మీద మోజు పెంచుకుంటున్నారు. అయితే ఎవరికి ఎపుడు ఎలా ఏ టైం లో పదవులు ఇవ్వాలీ అన్న దాని మీద ఫుల్ క్లారిటీగా ఉండే చంద్రబాబు వంగవీటికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక రెండు దశాబ్దాల తరువాత చట్ట సభల మెట్లెక్కబోతున్న వంగవీటికి విస్తరణలో అయినా మంత్రి పదవి ఖాయమని కూడా అపుడే ఆశలు కొత్తగా పెంచేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ టెర్మ్ లో మాత్రం వంగవీటికి రాజయోగం పట్టడం నూరు పాళ్ళు నిజం అని అంటున్నారు.