అల్లు అర్జున్ మామ ప్రజావాణిలో ఫిర్యాదు
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని రోడ్ విస్తరణలో భాగంగా, కొన్నిచోట్ల ప్రముఖుల ఇంటి స్థలాల్ని సేకరించాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని రోడ్ విస్తరణలో భాగంగా, కొన్నిచోట్ల ప్రముఖుల ఇంటి స్థలాల్ని సేకరించాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి స్థలాన్ని కొంత మేర సేకరించింది జీహెచ్.ఎంసి- టౌన్ ప్లానింగ్ విభాగం.
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ఉన్న 100 ఫీట్ల రోడ్డును రూ. 120 ఫీట్లకు విస్తరించడానికి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. సినీ హీరో బాలకృష్ణ ఇంటి నుంచి కొంతభాగం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామక వేత్తలు, వ్యాపారవేత్తలకు సంబంధించిన స్థలాలు భూసేకరణ పరిధిలో ఉన్నాయి.
పుష్ప స్టార్ అల్లు అర్జున్ మామ, బిజినెస్ మేన్ కం రాజకీయ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటి స్థలం నుంచి ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 30 అడుగులు భూమి సేకరించనుంది టౌన్ ప్లానింగ్ శాఖ. అయితే భూసేకరణ అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఆ మేరకు ఆయన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచించాలని కోరారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటు నుంచి భూమిని కోల్పోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివరణ కోరారు. రోడ్ వైడెనింగ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1100 కోట్లు ఖర్చు చేయనుంది.
ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి:
కేబీఆర్ పార్కు సమీపంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలోని ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాసుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కులతోపాటు యూటర్న్ లకు అవకాశం లేకుండా సాఫీగా వెళ్లడానికి ఈ అభివృద్ధి సహకరిస్తోంది. ఓవైపు మెట్రో ట్రైన్, నగరంలో సిటీ బస్సులు అందుబాటులో ఉన్నా హైదరాబాద్ ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. పర్యవసానంగా ట్రాఫిక్ ని అదుపులో ఉంచడానికి, అవసరమైన మార్పులను చేపడుతోంది ప్రభుత్వం.