పిక్స్ వైరల్.. చంద్రబాబు ఐదేళ్ల తర్వాత మళ్లీ అక్కడ!
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏటా దసరా పండుగ సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకురావడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
2014–19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ ఐదేళ్లు తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయనకు పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం కలగలేదు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులోనూ తిరుమల లడ్డూ తయారీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వులు వాడారనే ఆరోపణలు వెల్లువెత్తిన వేళ చంద్రబాబు తిరుమల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా లడ్డూ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించగా సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ ను పక్కనపెట్టి ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా సిట్ వేసింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు, మరో ఇద్దరు ఏపీ పోలీసులు, ఇంకొకరు కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు చెందిన అధికారి ఉంటారు.
మరోవైపు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే తిరుమలలో పర్యటించారు. ఏకంగా అలిపిరి నుంచి ఆయన పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. మూడు రోజులపాటు తిరుపతిలోనే ఉన్న పవన్ చివరి రోజు వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నవారిని ఏకేశారు.
ఈ పరిణామాలన్నింటి మధ్య చంద్రబాబు సతీసమేతంగా తిరుమల పర్యటనకు రావడం హాట్ టాపిక్ గా మారింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన చంద్రబాబు స్వయంగా తన తలపై పట్టువస్త్రాలు మోసుకుంటూ ధ్వజ స్తంభానికి మొక్కి ఆలయంలోకి వెళ్లారు. ఆలయం లోపల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.
కాగా గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తాను మాత్రమే తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన సతీమణి ఎప్పుడూ ఈ కార్యక్రమం పాల్గొనలేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.