ఈ సారి మామూలు ‘మే’ కాదు.. మెగా మంత్!
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్షేమ పథకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్షేమ పథకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన ఎన్నికల హామీలైన తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి మూడు కీలక పథకాలు ఎప్పుడు ప్రారంభించేది వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదన్న విమర్శల నడుమ.. మరో రెండు నెలల్లో మూడు పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వస్తున్న మే నెల మెగా మంత్ అంటూ కూటమి కార్యకర్తలు సంబరాలు చేస్తున్నారు.
ఏపీలో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ అందించిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తన ఎన్నికల ప్రచారంలో.. పిల్లలను ఉద్దేశించి నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం వైరల్ అయింది. అయితే గత విద్యా సంవత్సరం ఆరంభంలో అధికారంలోకి వచ్చిన కూటమి ఆర్థిక పరిస్థితులపై అంచనా లేకపోయడంతో అమలు చేయలేకపోయింది. ఇదే అదునుగా ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే మే నెలలో తల్లికివందనం పథకం అమలు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో విమర్శలకు చెక్ పెట్టినట్లైంది.
ఇక అన్నదాతా సుఖీభవ పథకం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ, ఆర్థిక సమస్యల వల్ల 9 నెలలుగా ఈ పథకాన్ని అందజేయలేకపోయారంటున్నారు. దీనిపైనా ప్రతిపక్షం విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే కూటమి మాత్రం అన్ని భరిస్తూ తగిన సమయంలోనే పథకాలు అంటూ చెప్పుకొచ్చింది. ఇక జూన్ లో ఖరీఫ్ ప్రారంభం అవుతుందని కనుక రైతుకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేల రూపాయలు చెల్లిస్తుంది. ఇది మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. ఈ మొత్తానికి అదనంగా మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పద్ధతిలోనే రైతులకు మూడు విడతలుగా ఈ రూ.20 వేలు అందుతుంది.
అదేవిధంగా మే నెలలో మరో కీలక పథకం అమలుకూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమ్మతి తెలియజేశారు. అదే మత్స్యకార భరోసా. ఏటా మే నెలలో మత్స్యకారులకు వేట నిషేధం విధిస్తారు. ఆ సమయంలో చేపలు గుడ్లు పెడుతుంటాయి. అందువల్ల సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ కాలంలో మత్స్యకారుల కుటుంబ ఖర్చుల కోసం ఏటా రూ.10 వేలు చెల్లించేది. ఈ మొత్తాన్ని కూడా మే నెలలోనే వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో మూడు కీలక పథకాలను ఒకే నెలలో అమలు చేయనుండటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్రంలో రోడ్లు బాగుచేయడంతోపాటు మౌలిక వసతుల కల్పనకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఈ 9 నెలల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మాత్రమే అమలు చేశారు. ఇప్పుడు కీలకమైన మూడు పథకాలకు ముహూర్తం ఫిక్స్ చేయడం, బడ్జెట్ లోనూ ఈ మేరకు నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సంక్షేమానికి సిద్ధమవడంతో ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న విమర్శలకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.