బాబు చెప్పేది జనాల చెవికి ఎక్కుతోందా ?
ఇక లేటెస్ట్ గా చూస్తే ఏలూరు పర్యటనలో చంద్రబాబు మరో మారు ఏపీ ఆర్ధిక దైన్యం గురించి జనాలకు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.;

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగవ సారి పీఠం ఎక్కి పది నెలలు నిండి పోయాయి. ఆయన గద్దె ఎక్కిన దగ్గర నుంచి ఒక్కటే అంటున్నారు. ఖజానా ఖాళీ అయింది అని. తాను ఎంతో చేద్దామని అనుకున్నాను కానీ గల్లా పెట్టెను చూస్తే భయమేస్తోంది అని. ఏమీ చేయలేని విధంగా చేతులు కట్టేస్తున్న నేపథ్యం ఉంది అని.
ఇలా చంద్రబాబు ఏదీ దాచుకోకుండానే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలలో ఆయన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏకంగా శ్వేత పత్రాలే రిలీజ్ చేశారు. అందులో ఎంత కన్నం పడిందీ జనాలకు డీటైల్డ్ గా వివరించారు.
మరో వైపు చూస్తే అసెంబ్లీలో కూడా అదే విషయం పదే పదే చెప్పారు. ఇక పబ్లిక్ మీటింగ్స్ లో అయితే ఎన్నో సార్లు జనాల ముందు ఏకరువు పెట్టారు. మీడియా వద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి మరీ రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరిగింది అని పూర్తి గణాంకాలతో సహా వివరించారు.
ఇక లేటెస్ట్ గా చూస్తే ఏలూరు పర్యటనలో చంద్రబాబు మరో మారు ఏపీ ఆర్ధిక దైన్యం గురించి జనాలకు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. అప్పులు తేవాలంటే కూడా వీలు కావడం లేదని అన్నారు. మరి బాబు ఇంతలా చెబుతూంటే జనాల చెవులకు ఎక్కుతుందా అంటే అది మాత్రం డౌటే. ఎందుకంటే పాలకుడు అంటే ఇంటి పెద్ద. ఒక కుటుంబ యజమాని నాకు ఇబ్బందిగా ఉంది అంటే కుటుంబ సభ్యులు పండుగలు ఆపుకోరు. తమ సరదాలు ఆపుకోరు. తాము చేయాల్సిన ఖర్చులలో కూడా కటింగ్స్ కి అసలు ఒప్పుకోరు.
ఎందుకంటే ఇంటి యజమాని కాబట్టి ఏదో బాధపడి బాధ్యత పడి తమకు ఇవ్వాల్సినవి ఇవ్వాల్సిందే అన్న ఒక ఆలోచనతో ఉంటారు. ఏపీలో కూడా జనాలు అత్యధిక భాగం అలాగే ఉంటారని అనుకోవాలి. ఈ రోజుకీ తమకు పధకాలు రావడం లేదని గోల పెడుతున్న వర్గాలు అలాగే ఉన్నాయి. ఉద్యోగులు తమకు జీతాలు వేళకు పడకపోతే అసంతృప్తిని వ్యక్తం చేస్తారు.
ఇక తమకు రావాల్సిన కరవు భత్యం సహా ఇత్యాది ఆర్ధిక లాభాల విషయంలో వారి లెక్కలు వారికి ఉంటాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు ఇవ్వాల్సింది ఇవ్వాలనే అంటారు. నిరుద్యోగులు ఉద్యోగాలు తీయాలని కోరుతారు. లేదా భృతి ఇచ్చినా ఓకే అంటారు.
ఇక సామాన్యులు ధరలు పెరగరాదు అంటారు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ మూడేనా ఇంకా ఎక్కువ ఇవ్వాలని అంటారు. ఉచిత బస్సు ఎపుడు అంటారు, ఇలా ఉన్నత స్థాయి నుంచి అట్టడుగు దాకా అందరూ ప్రభుత్వం వైపే చూస్తారు. ఎందుకు అంటే ప్రభుత్వం అంటే పెద్ద. ఆ పెద్ద నుంచి వరాలే కోరుతారు తప్ప వారి ఆర్ధిక వ్యవహారాలతో పని అసలు ఉండదు కాబట్టి.
అందువల్ల ముఖ్యమంత్రి ఎంతో చెప్పినా అవును సుమా అని ఆ నిమిషానికో ఆ సభా సమయానికో కాస్త వేడి నిట్టూర్పులు విడుస్తారేమో కానీ తమకు దక్కే రాయితీల విషయంలో మాత్రం ఎవరూ రాజీ పడ ప్రసక్తే ఉండదు. ఇక వారికి తోడు విపక్షాలు ఎగదోస్తూ ఉంటాయి. సంపద సృష్టించే ఇస్తామన్నారు కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని వైసీపీ ఎదురు దాడి చేయడానికి సిద్ధంగానే ఉంటుంది.
సరే ఆ సంపద సృష్టించే ఇస్తాను అంతవరకూ కస్తా ఆగమంటే జనాలు ఆగుతారా అంటే అది అసలు కుదిరే వ్యవహారమే కాదు. మొత్తం మీద బాబు కంఠ శోష తప్ప వినేది ఎవరూ పెద్దగా ఉండరన్నది మాత్రం యధార్ధమైన పచ్చి నిజం. మరి బాబు ఏమి చేయాలి అంటే కుండ బద్దలు కొట్టాలి. నాకు ఉన్న ఆర్థిక వనరులతో అభివృద్ధి చేయగలను, సంక్షేమం ఇంతే ఇవ్వగలను అని డైరెక్ట్ గా చెప్పేస్తే నచ్చే వారు నచ్చుతారు. లేని వారు లేదు. అంతే తప్ప ఖజానా పేరు చెప్పి కన్వీన్స్ చేయాలనుకుంటే మాత్రం బాబు వ్యూహం ఎక్కడో బోల్తా పడినట్లే అని అంటున్నారు.