మనవడి దగ్గర చంద్రబాబు పప్పులుడకవ్

చంద్రబాబు ఎంతటి పని రాక్షసుడైనా, మనవడిపై మమకారంతో తన పనులన్నీ వాయిదా వేసుకోవాల్సిన సంఘటన ఇటీవల జరిగింది.

Update: 2024-12-21 07:00 GMT

కష్టపడి పనిచేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో గుర్తింపు ఉంది. రోజులో 18 గంటలు కష్టపడే చంద్రబాబును అంతా పని రాక్షసుడు అంటారు. ఆయన జీవితంలో వ్యక్తిగత పనులు, కుటుంబానికి పెద్దగా సమయం ఇవ్వరు. తన జీవిత భాగస్వామి భువనేశ్వరికి కూడా రోజులో ఓ 20 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. ఈ విషయాన్ని కుప్పం పర్యటనలో భువనేశ్వరి స్వయంగా చెప్పారు. భార్యకే పెద్దగా సమయం కేటాయించని చంద్రబాబు.. ఒకరి వద్ద మాత్రం లొంగిపోయారు. ఆ వ్యక్తి నుంచి పిలుపురాగానే అన్ని పనులు ఆపేసి నేరుగా హైదరాబాద్ లో వాలిపోయారు. ఆ వ్యక్తే చంద్రబాబు మనవడు దేవాన్ష్.

ఔను, చంద్రబాబు ఎంతటి పని రాక్షసుడైనా, మనవడిపై మమకారంతో తన పనులన్నీ వాయిదా వేసుకోవాల్సిన సంఘటన ఇటీవల జరిగింది. గత వారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లాల్సివచ్చింది. అమరావతిలో విపరీతమైన బిజీలో ఉన్న ఆ ఇద్దరు ఆకస్మాత్తుగా హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సివచ్చిందో తాజాగా బయటపడింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో రాయ్ చెస్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చందరంగం పోటీల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ పాల్గొన్నాడు. అంతర్జాతీయ స్థాయి టోర్నీ కావడం, తొలిసారిగా హాజరుకావడంతో తన తాత తన పక్కన ఉంటే మోరల్ సపోర్టు ఉంటుందని భావించిన దేవాన్ష్ వెంటనే అమరావతికి ఫోన్ చేశాడు. కీలక టోర్నీ ఆడుతున్న తనకు తాత సపోర్టు కావాలని కోరాడట. మనవడి కోరికను కాదనలేకపోయిన చంద్రబాబు వెంటనే తన అధికారిక కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని, కుమారుడు నారా లోకేశ్ ను వెంట బెట్టుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన టోర్నీకి వెళ్లి దగ్గరుండి మనవడిని గెలిపించారు. తాను ఆడుతున్న అంతర్జాతీయ టోర్నీకి తాతా రావడంతో మురిసిపోయిన దేవాన్ష్ రెట్టించిన ఉత్సాహంతో పావులు కదిపి చాంపియన్ గా నిలిచాడు. దేవాన్ష్ పిలుపుతో వెళ్లినా టోర్నీలో ఆడిన చిన్నారులు అందరినీ ఉత్సాహ పరిచిన చంద్రబాబు చదువుతోపాటు ఇలాంటి పోటీల్లోనూ పాల్గొనాలని చిన్నారులకు పిలుపునిచ్చారు.

రాయ్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ చెస్ పోటీల్లో దేవాన్ష్ ఫాటెస్ట్ టవర్ ఆఫ్ హనోయి -7 డిస్క్, 7-డిస్క్ వేగంగా పూర్తి చేసి చాంపియన్గా నిలిచాడు. మొత్తం 127 కదలికతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించాడు.

Tags:    

Similar News