ట్రంప్ నినాదానికి దగ్గరగా బాబు... దావోస్ లో మాస్ స్టేట్ మెంట్స్!

ఈ సమయంలో దేశానికి చెందిన ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబుకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

Update: 2025-01-23 17:58 GMT

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర కేంద్రమంత్రులు.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల సీఎంలు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.. మాస్ స్టేట్ మెంట్లు ఇచ్చారు.

అవును... భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో దేశానికి చెందిన ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబుకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇందులో భాగంగా... దావోస్ నుంచి ఈసారి ఏ టెక్నాలజీని తీసుకెళ్తున్నారు అని విలేకరి ప్రశ్నించారు.

ఈ సమయంలో స్పందించిన చంద్రబాబు... "మేం ఇక్కడ నుంచి ఏ టెక్నాలజీని తీసుకెళ్లడం లేదు.. మా దేశం ప్రపంచానికే టెక్నాలజీని అందజేస్తోంది.. ప్రధాని మోడీ టెక్నాలజీకి బలమైన పునాది వేశారు" అని బదులిచ్చారు. ఇదే సమయంలో... తమకు విభిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా.. ఒకటికా కలిసి పనిచేస్తామని తెలిపారు. మోడీతో దేశానికి స్వర్ణయుగం ప్రారంభమైందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... భారతదేశం ప్రస్తుతం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని.. బ్లూంబర్ అనలిటిక్స్ ప్రకారం 2028 నాటికి జీడీపీ వృద్ధిలో అగ్రగామిగా నిలవనుందని.. అక్కడ నుంచి ఇక భారత్ కు ఎదురే ఉండదని చంద్రబాబు తెలిపారు. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈఓలు భారత సంతతికి చెందినవారే ఉన్నారని.. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే దావోస్ లో తొలిసారిగా టీమిండియాను చూస్తున్నానని చెప్పిన చంద్రబాబు.. భారత్ నుంచి దావోస్ కు వచ్చినవారిలో తానే సీనియర్ అని, తాను 1997లో తొలిసారి వచ్చినట్లు చెప్పారు. తామంతా దేశంలో వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినవారిమైనప్పటీకీ.. "ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్" అనే నినాదంతోనే ఉన్నామని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉందని చెప్పిన చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణలు, జనాభా వైవిధ్యం, సుస్థిర వృద్ధిరేటు, పటిష్టమైన విధానాలు, ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా బ్రాండ్ బలంగా ఉందని నొక్కి చెప్పారు.

Tags:    

Similar News