వీరికి మాటలు.. వారికి చేతలు.. బాబు కాస్ట్ లీ పాలిటిక్స్ ..!
ఫలితంగా కూటమికి ప్రజలు ఓటెత్తారు. కానీ.. 10 మాసాలు పూర్తవుతున్నా.. పేదలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏమీ కనిపించడం లేదని ఆ వర్గాలు లబోదిబోమంటున్నాయి.;

"చంద్రబాబు ప్రభుత్వం అంటే.. సంపన్నులకు మాత్రమే అనుకూలం. పేదలను పట్టించుకోదు" అని ఎన్నికలకు ముందు అప్పటి సీఎం, వైసీపీ అధినేత జగన్ పదే పదే చెప్పారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం.. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. పేదలకు మేలు జరిగేలా తాను చూస్తానని హామీ ఇచ్చారు. ఫలితంగా కూటమికి ప్రజలు ఓటెత్తారు. కానీ.. 10 మాసాలు పూర్తవుతున్నా.. పేదలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏమీ కనిపించడం లేదని ఆ వర్గాలు లబోదిబోమంటున్నాయి.
కేవలం నెలనెలా ఇస్తున్న పింఛన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు.. ఇవే అన్ని బటన్లు అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు.. చాలా జోరుగా ప్రజల మధ్యకు చేరిపోయాయి. దీంతో ఇక, తమకు ఎలాంటి పథకాలు అందే అవకాశం లేదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తాజాగా వస్తున్న సమాచారం. ఇదే నిజమైతే.. కూటమి పార్టీలకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు.. ఉన్నతస్తాయి వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటున్నాయన్న చర్చ కూడా ప్రజల మధ్యకు చేరిపోయింది.
చంద్రబాబు అయినా.. నారా లోకేష్ అయినా.. తమ వ్యాఖ్యల్లో ఇదే విషయాన్ని చెబుతున్నారు. పెట్టుబడులు.. సంస్థల రాక గురించే ప్రస్తావిస్తున్నారు. ఇది మంచిదే. కానీ, ఇదేసమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మెజారిటీ పేదలు పెట్టుకున్న ఆశలను వారు గుర్తించాల్సి ఉంటుంది. తాజాగా అమరావతిలో ఉన్నతస్థాయి వర్గాలకు ఐకాన్ నగరాన్ని నిర్మిస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనికి వారే పెట్టుబడులు పెట్టి నిర్మించుకుంటారని కూడా అన్నారు.
ఇది పైకి బాగానే ఉన్నప్పటికీ.. రేపు వారే పెట్టుబడులు పెట్టుకుని నిర్మించుకుంటే.. సర్వాధికారాలు.. హక్కులు కూడా.. వారికి దఖలు పడితే.. అక్కడ పేదలకు.. సాధారణ పౌరులకు ఎంట్రీ ఉండే అవకాశం లేదు. దీనిపై విస్తృత స్థాయిలో విమర్శలు రావడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇలా ప్రకటన చేయగానే.. విమర్శకులు వెంటనే స్పందించారు. ఎక్కడైనా.. ప్రభుత్వం, ప్రజల అధికారం రెండూ పనిచేసేలా ఉండాలి తప్ప.. గుత్తాధిపత్యం ఉన్నత స్థాయికి ఇచ్చేస్తే.. అది మొత్తానికే చేటు తెస్తుందని అంటున్నారు.