బాబు 'అతి' గా స్పందిస్తున్నారే ..!
మంచి అయినా.. చెడు అయినా.. ఎంత వరకు స్పందించాలో కొన్ని పరిధులు ఉంటాయి. కానీ, అదేంటో కానీ.. చంద్రబాబు ఒక్కొక్కసారి అతి చేస్తుంటారు.
రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. ఎక్కడా కూడా అతి పనికిరాదు. ఇది రేపటి రాజకీయాలను కార్నర్ చేస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అతిగా స్పందిస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలోనే! మంచి అయినా.. చెడు అయినా.. ఎంత వరకు స్పందించాలో కొన్ని పరిధులు ఉంటాయి. కానీ, అదేంటో కానీ.. చంద్రబాబు ఒక్కొక్కసారి అతి చేస్తుంటారు. తర్వాత కాలంలో అవన్నీ.. గుర్తుకు వస్తుంటాయి.
తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏపీకి వచ్చారు. ఇది అధికారిక పర్యటనే. అయితే.. కూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీగా ఉన్నందున.. బీజేపీ అగ్రనేత అయినందున.. ఆయనకు గౌరవం ఇవ్వడం తప్పులేదు. తప్పు కూడా కాదు. కానీ, ఈ విషయంలోనే అతి చేశారన్న టాక్ సోషల్ మీడియా సహా ఓ వర్గం ప్రధాన మీడియాలోనూ వినిపిస్తోంది. భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికార అనధికార వర్గాలను సుమారు 300 మందిని గన్నవరం విమానాశ్రయానికి పంపించారు.
వీరు భారీ సంఖ్యలో పుష్పగుచ్ఛాలను తీసుకుని అమిత్ షాకు స్వాగతం పలికారు. అయితే.. ఇలా ఎందుకు? అనేది సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. కేంద్రంలో పెద్దలతో చంద్రబాబుకు గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువగా గౌరవించి.. అమరావతి నిర్మాణానికి ప్రధానితోనే ఆయన శంకుస్తాపన చేయించారు. అయినా.. తర్వాత రాజకీయాల కారణంగా ఇదే చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏకంగా నల్ల చొక్కలు ధరించి ధర్నా చేశారు.
అంటే.. బీజేపీ నేతలను గుడ్డిగా నమ్మేయడం.. వారిని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా.. చంద్రబాబు అతి చేస్తున్నారన్న వాదన అయితే.. పార్టీలోనూ వినిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఇప్పటి వరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ఏ నాయకుడికీ స్వాగతం పలికిన సందర్భం అయితే లేదు. కానీ... ఇప్పుడు మాత్రం 300 మంది పార్టీ నాయకులు.. పదుల సంఖ్యలో అధికారులు గన్నవరానికి పోటెత్తారంటే.. చంద్రబాబు ఆదేశాలు లేకుండా అయితే.. ఎక్కడో కర్నూలు నుంచి రాత్రికి రాత్రి గన్నవరం అయితే రారు కదా! అనేది ప్రశ్న.
సో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని కేంద్రంలోని బీజేపీ విషయంలో చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించడమే మేలని పలువురు నాయకులు పరిశీలకులు కూడా సూచిస్తున్నారు. వారితో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటే అందరికీ ప్రయోజనమని.. చెబుతున్నారు.