మోడీ సీటులో చంద్రబాబు.. ఆశ్చర్యకర సంఘటన!
ఈ కార్యక్రమానికి ప్రదాని మోడీ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఢిల్లీలో గౌతమ బుద్ధుని కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అక్కడే ఎక్కువ సేపు ఉన్నారు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు బీజేపీలో మరింత గౌరవం లభించింది. నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల నడుమ ఆయన ఆశీనులయ్యారు. ఇది ఎవరూ ఊహించని సంఘటన కావడం గమనార్హం. తాజాగా హరియాణాలో బీజేపీ మూడో సారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 90 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ ఏకపక్షంగా(48) విజయం దక్కించుకుంది.
అయితే.. సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు కూడా ఆహ్వానం అందిం ది. నిజానికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ.. కేంద్రం పిలుపుతో ఆయన హరియాణాకు చేరుకున్నారు. రాజధానిలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుకు అరుదైన గౌరవం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోసం వేసి ఉన్న కుర్చీని ఆయనకు కేటాయించారు. ఈ కార్యక్రమానికి ప్రదాని మోడీ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఢిల్లీలో గౌతమ బుద్ధుని కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అక్కడే ఎక్కువ సేపు ఉన్నారు.
ఈ నేపథ్యంలో హరియాణాకు వచ్చేందుకు ఆలస్యమైంది. ఇక, ఆయన వచ్చే విషయం పై క్లారిటీ లేక పోవడం.. అదేసయమంలో చంద్రబాబు రావడంతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు.. ప్రధాని మోడీ కోసం.. తమ ఇద్దరి మధ్య వేసిన కుర్చీని చంద్రబాబుకు కేటాయించారు. స్వయంగా బాబు చేయి పట్టుకుని.. ఆ సీటులో కూర్చోబెట్టారు. అయితే.. కొద్ది సేపటికి ప్రధాని అక్కడకు చేరుకున్నారు. దీంతో బాబును ఖాళీ చేయించకుండానే.. మరో సీటును ఆయన పక్కగా కేటాయించారు.
ఇక, ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్‌షాతో చంద్రబాబు ఏవో విషయాలు చర్చించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా మరో మంత్రి, బీజేపీ సారథి జేపీ నడ్డాతోనూ చంద్రబాబు కలివిడిగా కనిపించారు. మొత్తానికి ఈ పరిణామం.. మిత్ర బంధాన్ని మరింత బలోపేతం చేయనుందని టీడీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబుకు కేంద్రం ఇస్తున్న గౌరవం పెరుగుతోందని చెబుతున్నారు.