కూటమి మంత్రులు... అలెర్ట్ కావాల్సిందేనా ?
అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు పలువురు మంత్రులకు సూచనలు చేసినట్లుగా తెలిసింది.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మొత్తం 25 మందికి కేబినెట్ లో చోటుకు చాన్స్ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబును పక్కన పెడితే 24 మందికి మాత్రమే మంత్రులుగా తీసుకున్నారు. ఒక్క కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. అయితే ప్రస్తుత కేబినెట్ లో టీడీపీకి 20 మంది జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు ఉన్నారు
ప్రతీ ఏడు మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి అన్న నిష్పత్తిలో ఈ విధంగా మంత్రివర్గం కూర్పుని చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి పొరపొచ్చాలకు వీలు లేకుండానే అవకాశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే కూటమి పాలన ఆరు నెలలుగా సాగుతోంది. సాధారణంగా మొదటి ఆరు నెలలను హానీమూన్ గా భావిస్తారు. అందులో ఏ చిన్న పొరపాట్లు ఉన్నా సర్దుకుని పోతారు. అసలైన కధ ఆ తరువాతనే మొదలవుతుంది. ఈ క్రమంలో మంత్రులు ఇప్పటిదాకా చేసిన తప్పులను కూటమి పెద్దలు చూసీ చూడనట్లుగానే తీసుకున్నారు.
వారికి దిశా నిర్దేశం చేస్తూ ముందుకు పోయారు. అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు పలువురు మంత్రులకు సూచనలు చేసినట్లుగా తెలిసింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తనదైన సలహా సూచనలు ఇచ్చారని అంటున్నారు.
తమ శాఖల మీద మంత్రులు పట్టు సాధించాలని అలాగే వారు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న మీదటనే ప్రకటించాలని కోరారని అంటున్నారు. అధికారులు చెప్పారు కదా అని గుడ్డిగా అనుసరించవద్దు అని కూడా సూచించారని తెలుస్తోంది.
తమ శాఖలలో ఎపుడు ఏమి జరుగుతోంది అన్నది మంత్రులు అవగాహనతో అప్రమత్తతతో ఉండాలని కూడా పేర్కొన్నారు అని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకుని పోవాలని కోరారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మొత్తం 24 మంది మంత్రులలో అరడజన్ మంది మంత్రులు బాగా పనిచేస్తున్నారు అని అంటున్నారు. ఆ తరువాత పరవాలేదు అన్న వారు మరో అరడజను మంది ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇక మిగిలిన వారు తమ తీరుని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంది అని అంటున్నారు.
విశేషం ఏంటి అంటే చాలా మంది కొత్త వారికి కీలకమైన శాఖలు ఇచ్చారు. గతంలో అయితే ఈ శాఖలు సీనియర్ నేతల వద్ద ఉండేవి. కానీ ఇపుడు ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ రావాలని ఈ విధంగా చేశారు. అయితే బరువైన ఆ బాధ్యతలను సక్రమంగా హ్యాండిల్ చేయడంలో మంత్రులు కొందరు తడబడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది
ఇక మంత్రుల మీద కేవలం ప్రభుత్వ బాధ్యతల్తో పాటు పార్టీ బాధ్యతలూ ఉన్నాయి. తమ జిల్లాలలో పార్టీని కో ఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది. అలాగే తాము ఇంచార్జి మంత్రులుగా ఉన్న చోట కూడా పార్టీని పటిష్టం చేయాల్సి ఉంది. ఇక విపక్షం దూకుడుకు కళ్ళెం వేయాల్సి ఉంది. ప్రజలకు ఎప్పటికపుడు అన్ని విషయాలూ తెలియచేస్తూ ప్రభుత్వాన్ని ముందున నిలబెట్టాల్సి ఉంది.
మరి ఇవన్నీ చేసిన వారే సమర్ధులుగా పేరు తెచ్చుకుంటారు. ఆ విధంగా మంత్రులు అంతా పనిచేయాలని కూటమి పెద్దలు కోరుకుంటున్నారు. అంతే కాదు తన శాఖలకు సంబంధించి వినూత్న ఆలోచనలు చేయడం ప్రభుత్వానికి కొత్త ఆదాయ మార్గాలను కూడా తేవడం కోసం మంత్రులు పనిచేయాల్సి ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే మంత్రులంతా బాగా పనిచేయాలని కోరుకుంటున్న కూటమి పెద్దలు ఒక వేళ ఆ రకమైన మార్పు రాకపోతే ఏమి చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. 2025 జూన్ 12 దాకా చూసిన మీదట మార్పుచేర్పులకు దిగుతారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. సో మంత్రులు అంతా అలెర్ట్ కావాల్సి ఉందని అంటున్నారు.