నాకు కష్టం వస్తే ఆయనను తలచుకుంటాను

మొత్తానికి సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడంతో వ్యవహారం కొలిక్కి వచ్చింది.

Update: 2024-10-05 13:58 GMT

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎంత రచ్చ జరగాలో అంత జరిగింది. రాజకీయంలో పడి లడ్డూ నలిగిపోయింది. లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ చోటు చేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో మీరు పాపాత్ములు అంటే మీరు పాపాత్ములు అంటూ అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు.

మొత్తానికి సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడంతో వ్యవహారం కొలిక్కి వచ్చింది. జగన్ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక చంద్రబాబు అయితే ఈ ఇష్యూ మీద మాట్లాడమే తగ్గించేశారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలో రెండు రోజుల పాటు గడిపిన బాబు తిరుమలకు వస్తే ఒక దివ్యానుభూతి కలుగుతుంది అని మీడియాకు చెప్పారు.

ఇక్కడకు వచ్చిన భక్తులు ఆ అనుభవాన్ని పొందుతారని శ్రీవారి ఆశీస్సులు అందరూ అందుకుంటారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను శ్రీవారి భక్తుడిని అని చెప్పారు. తాను ప్రతీ రోజూ నిద్ర లేచిన వెంటనే శ్రీవారిని తలచుకుని తన కార్యక్రమాలు మొదలుపెడతాను అన్నారు.

అలాగే తనకు కష్టం వచ్చిన ప్రతీసారె శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని తలచుకుంటాను అని చెప్పారు. తమ ఇలవేలుపు స్వామి వారు అన్నారు. తిరుమల శ్రీవారు ప్రపంచానికే ఆరాధ్యుడు అని అన్నారు. అందుకే టీటీడీలో మొదటి నుంచి ప్రక్షాళన ప్రారంభించామని అన్నారు. తిరుమల లడ్డూకి ప్రపంచ ప్రఖ్యాతి ఉందని అన్నారు. లడ్డూ ఆ మాదిరిగా ఎవరూ చేయలేరని అందుకే పేటెంట్ ఉందని అన్నారు.

ఇక మీదట తిరుమలలో లడ్డూతో పాటు అన్న ప్రసాదం ఇతర ప్రసాదాల విషయంలో నాణ్యతను పరిశీలిస్తామని చంద్రబాబు ప్రకటించడం విశేషం. తిరుమల అన్నది అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రమని దానిని మరింత అందంగా పవిత్రంగా తీర్చిదిద్దుతామని బాబు చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తుల అభిప్రాయాలను కూడా తీసుకుని ప్రపంచంలోనే అగ్ర స్థానంలో తిరుమలని ఉండేలా చూస్తామని అన్నారు.

తిరుమలలో మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.

ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు తిరుమల కేంద్ర బిందువు అని బాబు చెప్పారు. తిరుమలలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా నిత్యాన్నదాన పధకం ప్రారంభమైందని బాబు గుర్తు చేసారు. దేశంలో ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం దశాబ్దాలుగా ప్రతీ రోజూ అద్భుతంగా జరుగుతోందని బాబు తెలిపారు. ఆ రోజు ఎన్టీఆర్ హయాంలో రెండు,మూడు వేల మందితో ప్రారంభమైన నిత్యాన్నదానం ఈ రోజున ఏకంగా 3 లక్షల మంది దాకా చేరుకుంది అంటే అంతా శ్రీవారి మహిమ అని బాబు తెలిపారు.

మొత్తానికి చూస్తే చంద్రబాబు తనకు తిరుమల శ్రీవారి పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను మరోమారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తన కష్టం తన బాధలు అన్నీ స్వామితోనే అంటూ ఆయన చెప్పిన మాటలు ఇపుడు చర్చకు వస్తున్నాయి.

Tags:    

Similar News