బాబు బాగా బిజీ : నామినేటెడ్ పదవులు ఇప్పట్లో రావు !

2014 నుంచి 2019 దాకా టీడీపీ పాలించిన సందర్భంలో కూడా నామినేటెడ్ పదవులు పెద్దగా పంపిణీ చేసింది లేదు.

Update: 2024-09-10 17:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతోంది. పెద్దలకు పదవులు వచ్చాయి, కానీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులకు పదవులు అయితే లేవు.వారి బాధ ఈ రోజుది కాదు దశాబ్దాల నాటిది. 2014 నుంచి 2019 దాకా టీడీపీ పాలించిన సందర్భంలో కూడా నామినేటెడ్ పదవులు పెద్దగా పంపిణీ చేసింది లేదు.

టీడీపీ మొదటి నుంచి ఈ తరహా పదవులను ఆచీ తూచీ మాత్రమే ఇస్తూ ఉంటుంది. అయితే 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అయితే నామినేటెడ్ పదవులు ఏకబిగిన పంపిణీ చేసింది. అంతే కాదు వారికి జీతభత్యాలు కూడా సమకూర్చి పెట్టింది. మరి అయిదేళ్ల వైసీపీ పాలన మీద ఒళ్ళు హూనం చేసుకుని పోరాడిన వారు అంతా తమకు కూడా ఒకేసారి నామినేటెడ్ జాతర జరిపేసి పంచేయాలను కోరుకుంటున్నారు.

ప్రభుత్వం వచ్చిన వెంటనే పదవులు పంచితే ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయన్నది కూడా టీడీపీ తమ్ముళ్లతో పాటు ఇతర పార్టీల వారి ఆలోచన.రెండేళ్ల మూడేళ్ల కాలపరిమితితో ఉండే ఈ పదవుకు అయిదేళ్ళ కూటమి పదవీ కాలంలో కనీసం రెండు సార్లు అయినా భర్తీ అవుతాయి. అలా రెట్టింపు ఆశావహులకు అవకాశాలు వస్తాయన్నది కూడా వారి ఆశ.

అయితే టీడీపీ కూటమి పెద్ద అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు కూర్చుని ఈ పదవుల పందేరాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆగస్ట్ నెల శ్రావణ మాసం మంచిదని గత నెలలోనే పదవుల పంపిణీ అని అన్నారు. దాని కోసం వివిధ మార్గాల ద్వారా ఆశావహుల నుంచి ఎంపిక చేశారు అని ప్రచారం జరిగింది. అయితే శ్రావణ మాసం ముగిసింది. ఆ వెంటనే విజయవాడ మునిగింది.

అనూహ్యంగా బుడమేరు వరదలు రావడం బెజవాడ పూర్తిగా నీటిలో నానడంతో గత పది రోజుల నుంచి చంద్రబాబు సహా ప్రభుత్వం అంతా అక్కడే ఉంటూ బిజీగా గడుపుతోంది. వరద సహాయ చర్యలు ఒక కొలిక్కి రావాల్సి ఉంది. ఇక ఆస్తి నష్టం కూడా పెద్దగా జరిగింది. దాంతో ప్రభుత్వం మళ్లీ సర్దుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల విషయం అన్నది పూర్తిగా పక్కకు వెళ్ళిపోయింది అని అంటున్నారు. అసలు ఈ విషయం గురించి ఇంతటి విపత్తు వేళ ఎవరైనా నోరు తెరచి అడిగే సాహసం చేయగలరా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే నామినేటెడ్ పదవుల విషయంలో చూస్తే టీటీడీ చైర్మన్ పదవి ఖరారు అయిందని ఒక మీడియా అధిపతికి ఇస్తారని కూడా ప్రచారం సాగింది. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి అలగే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇలా కీలకమైన పదవులకు కొందరి మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలతో ఒక జాబితా కూడా ఆ మధ్యన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయితే అవన్నీ ఉత్తవి అని ఇపుడు తేలుస్తోంది.

దానికి కారణం నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో కూటమి పెద్దలు అంత తొందర పడటం లేదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దాంతో కొంత పొదుపు పాటించే విధంగానే ప్రభుత్వం ఉంది. మరో వైపు చూస్తే జనసేన అధినాయకత్వం నుంచి పెద్దగా ఒత్తిడి లేదని కూడా అంటున్నారు. బీజేపీకి ఇస్తే మూడో నాలుగో చైర్మన్ పదవులు వస్తాయి. వారు కూడా వాటి మీద పెద్దగా పట్టింపుగా ఉండడంలేదు. ఇచ్చిన నాడు వచ్చిన నాడే దక్కుతాయని చూస్తున్నారు.

నిజానికి దసరా వేళలలో నామినేటెడ్ పదవులల్లో తొలి విడతను రిలీజ్ చేయాలని ఆ విధంగా విడతల వారీగా ఇచ్చుకుంటూ పోవాలని టీడీపీ అధినాయకత్వం అనుకుంది అని అంటున్నారు. కానీ ఇపుడు సీన్ మొత్తం మారింది. ఇపుడు వచ్చి పడిన వరదలతో ఆ పనుల బిజీ తో మరో మూడు నాలుగు నెలల దాకా నామినేటెడ్ పదవుల విషయంలో ఏమీ మాట్లాడే సీన్ అయితే లేదని అంటున్నారు

మరి నామినేటెడ్ పదవుల పండుగ ఎపుడు అంటే ఎపుడు అయితే అపుడు అన్నట్లుగానే అంటున్నారు. నిజానికి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల విషయంలోనే అన్నీ ఆలోచిస్తున్న వేళ నామినేటెడ్ పదవుల పేరుతో పందేరాలు చేయడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. సో ఇప్పటికైతే వాయిదా పడినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News