అమరావతిలో 'ఏ' అంటే ఆర్టిఫిషియల్.. 'ఐ' అంటే ఇంటెలిజెన్స్!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-30 07:36 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమరావతి విషయంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

అవును... అమరావతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రపంచ దశా దిశా మారుస్తున్నంతగా ప్రాచుర్యం పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని.. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రపంచ దేశాలకు చేరువ చేయాలంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రాన్ని పఠించాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇదే సమయంలో ఇంగ్లిష్ లెటర్స్ లోని అమరావతిలో మొదటి అక్షరం "ఏ", చివరి అక్షరం "ఐ" హైలెట్ అవుతూ... రాజధాని లోగోను క్రియేట్ చేయాలని తెలిపారు.

ఇదే క్రమంలో... అమరావతిలో సాంకేతిక వ్యవస్థలు మెరుగుపడాలని.. 5జీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా.. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వచ్చే నెల 15లోగా వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించిన నిధులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇదే సమయంలో.. అమరావతిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు, త్వరిగత గతిన పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మొదలైన విషయాలపైనా ఆయన అధికారులతో చర్చించారు. అదేవిధంగా... రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేవారికి నిర్మించి ఇచ్చే భవనాలపైనా (హ్యాపీ నెస్ట్) బాబు ప్రత్యేకంగా చర్చించారు.

ఈ ప్రాజెక్టును జగన్ సర్కార్ ఐదేళ్లపాటు నిలిపివేయడం వల్ల నిర్మాణవ్యయం రూ.714 కోట్ల నుంచి రూ.930 కోట్లకు చేరిందని.. దీనివల్ల సీ.ఆర్.డీ.ఏ.కి రూ.216 కోట్ల నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ గతంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.. ప్రాజెక్టును పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News