చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఆ నిబంధన పాటించాల్సిందే..

ఇన్నాళ్లు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన నిబంధనలను సడలిస్తూ కొత్తగా జనాభా పెంపు కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Update: 2025-01-17 07:08 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇన్నాళ్లు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన నిబంధనలను సడలిస్తూ కొత్తగా జనాభా పెంపు కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన ప్రాయంగా సంకేతాలిచ్చారు. సీఎం ప్రతిపాదిస్తున్న ప్రకారం ఇకపై స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఇద్దరు పిల్లలను కనాల్సివుంటుంది.

ప్రస్తుతం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హలు. 1990వ దశకంలో జనాభా నియంత్రణపై అవగాహన కోసం ఈ నిబంధనను తీసుకొచ్చారు. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కార్పొరేషన్ల మేయర్ల వరకు అందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండటం వల్ల ఈ పదవులకు పోటీ చేసేవారికి జనాభా నియంత్రణపై అవగాహన ఉండాలని ఈ నిబంధనను అప్పట్లో తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం జనాభా వేగంగా తగ్గిపోతోంది. వచ్చే ఏడాదికి ఏపీ జనాభా సుమారు ఐదున్నర కోట్లు ఉంటుందని అంచనా. ఇక 2050 నాటికి ఈ జనాభాలో పెద్దగా మార్పు ఉండకపోగా, ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు యథావిధిగా పాటిస్తే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిరావొచ్చు అంటున్నారు. వయోధికులు ఎక్కువై, యువ జనాభా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో జనాభా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు.

జనాభా నియంత్రణకు ప్రస్తుతం పాటిస్తున్న నియమాలు స్థానే జనాభా పెరిగేందుకు కొత్త నిబంధనలు అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలు ఉన్నవారు అనర్హులని ఇన్నాళ్లు అమలు చేసిన నిబంధనను ఎత్తివేస్తూ దాని స్థానంలో తప్పనిసరిగా ఇద్దరు పిల్లలు ఉండాలని నియమం విధించాలని ప్రతిపాదిస్తున్నారు. అంటే ఇద్దరికి మించిన సంఖ్యలో ఎంతమంది ఉన్నా ఎన్నికల్లో పోటీకి అర్హత ఉన్నట్లే పరిగణిస్తారు. అదే సమయంలో పిల్లలు లేని, ఒక్కరితోనే సరిపెట్టుకునే దంపతులకు ఎన్నికల్లో పోటీకి అనుమతించరు.

జనాభా పెంపు అవశ్యకతను వివరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదన త్వరలో చట్టం కాబోతుందని అంటున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో ఈ లోగా దీనిపై చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News