చంద్రబాబు పర్యటన రద్దు.. రోజంతా సచివాలయంలోనే!
ఏపీలో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా.. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించాల్సిన చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఏపీలో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా.. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించాల్సిన చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఓర్వకల్లులో పర్యటించాల్సిన చంద్రబాబు.. సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు.. విజయవాడ, తిరుపతి, విజయనగరం వంటి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడి.. పలువురు మృతి చెందారు.
కొండ ప్రాంతాల్లోని ప్రజలు నివాసాలను కూడా కోల్పోయారు. ఇక, ప్రధాన పట్టణాలే జలదిగ్భందం అయ్యాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు తన ఓర్వకల్లు పర్యటనను రద్దుచేసుకున్నారు. ఉదయం 11 గంటలకే ఆయన సచివాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై ఆయన కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు సహా కొండ ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించా రు. ఇదేసమయంలో పింఛన్ల పంపిణీలో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి పిలవాలని కూడా సూచించా రు. సహాయక చర్యల్లో అందరూ పాల్గొనాలని.. అవసరమైతే.. 2 వ తారీకున మిగిలిని పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. తాను సచివాలయంలో అందుబాటులో ఉంటానని.. ఏంజరిగినా.. తనకు సమాచారం అందించాలని చంద్రబాబు సూచించారు. సాధారణ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాలని ఆదేశించారు.
సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలిపారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.