చంద్రబాబు మదిలో ఎవరున్నారు? కొత్త సీఎస్, డీజీపీగా ఎవరికి చాన్స్
కొత్త సీఎస్, డీజీపీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యాలను పకడ్బందీగా అమలు చేసే అధికారుల కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావులు ఈ నెలలో రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే ఒకసారి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు పొడిగింపు ఇవ్వగా, మరోసారి చాన్స్ లేదంటున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా రిటైర్ కాబోతున్నందున కొత్తగా మరో సీనియర్ ఐపీఎస్ ను డీజీపీగా నియమించే చాన్స్ ఉందంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాయిస్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి ఎక్కువవుతోంది.
కొత్త సీఎస్, డీజీపీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యాలను పకడ్బందీగా అమలు చేసే అధికారుల కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎస్ పోస్టు కోసం ముగ్గురు సీనియర్ అధికారులతోపాటు, కేంద్రంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న మరో అధికారి పేరు వినిపిస్తోంది. అదేవిధంగా డీజీపీగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటికే ఒకసారి సీఎస్ పదవీకాలం పెంచడంతో మరోసారి పెంచే అవకాశం లేదంటున్నారు. దీంతో ఈ పోస్టు కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో విజయానంద్, ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరి పదవీకాలం ఆధారంగా ఎవరిని నియమించాలనే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.
సీనియర్ ఐఎఎస్ లు ముగ్గురిలో సాయిప్రసాద్, సిసోడియా 1991 బ్యాచ్ అధికారులు. విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి. విజయానంద్ 2025 నవంబర్, సాయిప్రసాద్ 2026 మేలో రిటైర్ కానున్నారు. ఇక సిసోడియాకు 2028 జనవరి వరకు అవకాశం ఉంది. ఇదే సీనియార్టీ లిస్టులో శ్రీలక్ష్మి, అనంతరాము పేర్లు ఉన్నాయి. కానీ, వీరిద్దరికి అవకాశం లేదని చెబుతున్నారు. సీఎస్ గా రేసులో ఉన్న ముగ్గురిలో విజయానంద్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న ప్రతి ప్రభుత్వంలోనూ విజయానంద్ కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఇక డీజీపీగా ఎవరిని నియమిస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున రిటైర్ అవుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ద్వారకా తిరుమలరావు డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆరేడు నెలల్లో ప్రభుత్వం అప్పగించిన కీలక కేసులను సమర్థంగా డీల్ చేశారు. దీంతో ఆయనకు మరో ఆరు నెలలు కొనసాగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఏదైనా కారణం చేత ద్వారకా తిరుమలరావును కొనసాగించలేకపోతే డీజీపీగా ఎవరికి చాన్స్ ఇవ్వాలనే విషయమై ప్రభుత్వం మరోవైపు కసరత్తు చేస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తర్వాత సీనియార్టీ లిస్టులో హరీశ్ కుమార్ గుప్తా పేరు ఉంది. ఆయనకే అవకాశమిస్తారా? వేరే ఎవరైనా కొత్తవారిని తీసుకొస్తారా? అనేది చర్చకు తావిస్తోంది.