5 డేస్.. చంద్రబాబు స్పెషల్ సెలబ్రేషన్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. ఈ నెల 20న 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు ఆ రోజును ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు.;

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. ఈ నెల 20న 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు ఆ రోజును ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో బుధవారం అమరావతి నుంచి బయలు దేరి విదేశాలకు వెళుతున్నారు. తొలుత అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు అక్కడి నుంచి రాత్రికి ఫారిన్ వెళుతున్నారు. పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం అయినందున సీఎం చంద్రబాబు పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాస్త విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో వారి కోసం ఐదు రోజులు కేటాయించారు. తన 75వ జన్మదినాన్ని పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోనున్నారు. అలా అని దేశంలో ఎక్కడ ఉన్నా, బంధువులు, స్నేహితులు, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన సీఎం.. తన పుట్టిన రోజు వేడుకలను పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్యే అత్యంత సాదాసీదాగా జరుపుకోవాలని భావించి విదేశాలకు వెళ్లారు.
భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ దంపతులు, మనవడు దేవాన్ష్ తో మాత్రమే చంద్రబాబు విదేశాలకు వెళుతున్నారు. వీరి వెంట కొద్ది మంది సహాయకులు వెళ్లనున్నారు. వాస్తవానికి ఏటా వేసవిలో యూరోప్ పర్యటనకు వెళ్లడం చంద్రబాబు అలవాటు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఫ్యామిలీ కోసం యూరప్ పర్యటనకు వెళుతుంటారని చెబుతుంటారు. అయితే ఈ సారి తన పుట్టిన రోజున విదేశాలకు వెళ్లాలని నిర్ణయించడంతో తన ప్రైవేటు కార్యక్రమాన్ని బయటకు వెళ్లడించలేదు. ప్రపంచం నలుమూలలా చంద్రబాబు అభిమానులు ఉండటం, పుట్టిన రోజు, అందునా డైమండ్ జూబ్లీ ఇయర్ కావడంతో అంతా స్పెషల్ గా పరిగణిస్తున్నారు. దీంతో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని చంద్రబాబు తన పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారంటున్నారు.