బాబు బోటు ప్రయాణం...అమరావతికే దెబ్బేస్తోందా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడ వరదలలో ఒక సీఎం గా కంటే ఒక సంరక్షకుడిగా మారిపోయారు.

Update: 2024-09-07 23:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడ వరదలలో ఒక సీఎం గా కంటే ఒక సంరక్షకుడిగా మారిపోయారు. ఆయన ఎంతో కష్టపడ్డారు. ఏడున్నర పదుల వయసును బాబు పక్కన పెట్టేశారు. ఆయన బెజవాడ వరదల నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్ నే నివాసంగా చేసుకుని మొత్తం అక్కడే ఉన్నారు.

అంతే కాదు ఈ వరదలలో స్పెషాలిటీ ఏంటి అంటే చంద్రబాబు ఎక్కని వాహనం లేదు, ఆయన ట్రక్కు ఎక్కారు, ట్రాక్టర్ ఎక్కారు, బోటు ఎక్కారు. బల్లకట్టు ఎక్కారు. ఆ మీదట వరదలలో మోకాల్లోతు నీళ్ళల్లో నడిచారు, మొత్తం బెజవాడ పరిస్థితిని ఆయన ఏరియల్ సర్వే ద్వారా అధ్యయనం చేశారు. ఆ విధంగా బాబు హెలికాప్టర్ లోనూ ప్రయాణించారు.

అయితే బాబు చేసినవన్నీ బాధితుల కోసమే. వారికి ఓదార్పు ఊరట ఇవ్వడం కోసమే. కానీ బాబు విజయవాడ వీధులలో బోటు ప్రయాణం చేయడం మాత్రం జాతీయ స్థాయిలోనే హైలెట్ అయిపోయింది. జాతీయ మీడియా దానినే పట్టుకుంది.

పెద్ద ఫోటోలు వేసి మరీ ఇది ఘనత వహించిన విజయవాడ పరిస్థితి అని రాసుకొచ్చింది. భారీ వరదలలో శతాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ ఎలా మునిగిందో జాతీయ మీడియా ఫోకస్ చేసింది.

అమరావతిలో భారీ వర్షాల వల్ల అతలాకుతలం అయిన పరిస్థితిని కూడా కవరేజ్ చేస్తూ ఫుల్ ఫోకస్ అక్కడ పెట్టేసింది. ఒక విధంగా చూస్తే నేషనల్ మీడియాలో ఇదే హైలెట్ అయింది. దాంతో ఇపుడు చర్చ అంతా బెజవాడ మునక కంటే కూడా అమరావతి మీదనే ఎక్కువగా సాగుతోంది.

అమరావతి అంటే మామూలు విషయం కాదు, ఏపీకి అది కలల రాజధాని.ప్రపంచ రాజధానిగా దానిని మార్చాలని చంద్రబాబు గత పదేళ్ళుగా చూస్తున్నారు. అమరావతి విషయంలో తన మొదటి టెర్మ్ పాలనలో జరిగిన తప్పులేవీ చోటు చేసుకోకుండా ఈసారి డే వన్ నుంచే అక్కడ యాక్టివిటీని స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అయితే అమరావతి విషయంలో ప్రస్తుతం అన్నీ మంచి శకునములే అని అంతా భావిస్తున్న నేపధ్యంలో అనూహ్యంగా వచ్చి పడిన భారీ వర్షాలు వరదలు కొంప ముంచాయని అంటున్నారు. దాంతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేలాగానే పరిస్థితి ఉంది అని అంటున్నారు

అమరావతి మునిగింది అని వైసీపీ ప్రచారం సోషల్ మీడియాలో చేసిన దానికి టీడీపీ శ్రేణులు బాధపడ్డాయి. కానీ నేషనల్ మీడియాలోనూ ఏపీ పరిస్థితిని వివరిస్తూ బెజవాడ అమరావతిల మీద ఫోకస్ పెట్టడంతో ఇపుడు అమరావతి బ్రాండ్ ఇమేజ్ మీద దాని ప్రభావం పడుతోంది అని అంటున్నారు.

అమరావతి బ్రహ్మాండమైన రాజధాని కావాలీ అంటే పెట్టుబడులు రావాలి. మరి ఇపుడు భారీ వర్షాలు వరదలు అమరావతి అసలు పరిస్థితిని చెప్పేశాయని అంటున్నారు. అమరావతికి ఇదంతా ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. అమరావతికి పక్కనే కొండవీటు వాగు ఉంది. అలాగే క్రిష్ణా నది కూడా ఉంది. ఇవన్నీ పాజిటివ్ గా చూపిస్తే పరవాలేదు, కానీ భారీ వానలు వరదల వల్ల నెగిటివిటీ పెరిగితే మాత్రం అమరావతి బ్రాండ్ ఇమేజ్ కే దెబ్బ అని అంటున్నారు. బాబు బోటు లో వెళ్లడం అన్నది హైలెట్ అయిన నేపథ్యంలో రేపటి అమరావతి సంగతేంటి అన్న ప్రశ్న అయితే ఉదయించక మానదు, దీనిని ఎలా కవర్ చేసుకుని ముందుకు వెళ్తారు అన్నదే కీలకమైన చర్చగా ఉంది.

Tags:    

Similar News