సొమ్ము కేంద్రానికి.. క్రెడిట్ చంద్రబాబుది?

అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ప్రశంసలు అందుకుంటోంది.;

Update: 2025-04-08 15:30 GMT
సొమ్ము కేంద్రానికి.. క్రెడిట్ చంద్రబాబుది?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న సీఎం.. రాష్ట్రాభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నారు. తాను అనుకున్న పథకాలకు కేంద్ర నుంచి నిధులు తెచ్చేలా పక్కా వ్యూహం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వలే కేంద్రంతో పేచీలకు వెళ్లకుండా సాఫ్ట్ గా తన పని పూర్తి చేయించుకుంటున్నారు. తాజాగా అమరావతిలో మెడి సిటీ కోసం కేంద్రంతో పెట్టుబడి పెట్టిస్తున్న సీఎం ప్లాన్ మరోమారు చర్చనీయాంశమవుతోంది.

అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ప్రశంసలు అందుకుంటోంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్పీకరించిన చంద్రబాబుపై జనం భారీ ఆశలే పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు జనం పట్టం కట్టారనేది అందరికీ తెలిసిందే. అయితే సంక్షేమమైనా.. అభివృద్ధి అయినా డబ్బుతో ముడిపడని అంశమే కావడంతో జనం ఆశలను సాకారం చేయడం సీఎం చంద్రబాబుకు సవాల్ గా మారిందని చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి చంద్రబాబు తెలివిగా బయటపడుతుండటమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది.

రాష్ట్ర విభజన సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదాను సాధించలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగానే 2014లో బీజేపీతో దోస్తీ కట్టిన చంద్రబాబు 2018లో కటీఫ్ చెప్పేశారు. మళ్లీ అనుకోని కారణాలు, అనూహ్య పరిణామాలతో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ జోడి కట్టారు. అయితే ఈ సారి చంద్రబాబు నయా ప్లాన్ అమలు చేస్తూ గతంలో వచ్చిన విమర్శలను అధిగమిస్తున్నారని అంటున్నారు. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం సాధించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జల జీవన్ మిషన్ పథకం అమలు చేసేందుకు ముగిసిన గడువు పొడిగించడం వరకు చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపి భారం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వంపై మోపారంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం రాష్ట్రానికి తలకుమించిన భారంగా చెబుతున్నారు. అంతేకాకుండా ఇతర అభివృద్ధి పనులకు నిధుల సాధన కూడా కత్తిమీద సాముగానే చెబుతున్నారు. చివరికి రాష్ట్రం ఎప్పటి నుంచో అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ కూడా బకాయిల కొండలా మారిపోవడంతో చంద్రబాబు పూర్తిగా కేంద్రంపై ఆధారపడే ప్లాన్ కు పదును పెట్టారంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రమే నిధులు సర్దుబాటు చేస్తున్నా, సకాలంలో నిధుల విడుదలయ్యేలా చూసుకోవడంతోపాటు ఇతర పథకాలకు కేంద్రం నుంచి గరిష్ఠ మొత్తం తీసుకోవడమే వ్యూహంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం సూర్య ఘర్ బిజిలీ మఫ్త్ యోజన వంటి పథకాలతోపాటు పీఎం హౌసింగు స్కీం, జలజీవన్ మిషన్, స్త్రీ శక్తి, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి వంద శాతం కేంద్రమే ఖర్చు భరించేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. దీంతో డబ్బు కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూర్చుకుని ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News