మళ్లీ అదే ట్రాక్ లో బాబు .. జనం మూడ్ ఏంటో ?
అయితే బాబు అభివృద్ధి మంత్రం మళ్లీ టీడీపీని అధికారంలోకి తెస్తుందా అంటే దాని మీదనే చర్చ సాగుతోంది. జనాల మూడ్ గతంలోలా లేదు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చంద్రబాబు అంటే అభివృద్ధికి చిరునామా అని అంటారు. ఆయన ఎపుడూ డెవలప్మెంట్ అని నినదిస్తూ ఉంటారు. ఆయన ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాని వల్ల పది మందికి ఉపయోగపడాలని కోరుకుంటారు. ఆయన 1995లో తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఇదే విధానం అనుసరిస్తూ వస్తున్నారు.
ఆయనలో సంస్కరణవాది ఎపుడూ డామినేట్ చేస్తూ ఉంటారు. ఆయన వినూత్న ఆలోచనలు కూడా దానికి కారణంగా ఉంటూ వస్తున్నాయి. ఆయన ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి మంత్రమే జపించారు. సంక్షేమం అన్నది ఆయనకు ఆ తరువాత ప్రయారిటీగా మారింది. అందుకే 1999 ఎన్నికల్లో ఆయనకు అత్తెసెరు మార్కులే వచ్చాయి.
అలా ఆయనకు అధికారం అయితే బొటా బొటీ మెజారిటీతో దక్కింది. 2004 నాటికి ఏకంగా అధికారం చేజారింది. దానికి కారణం కాంగ్రెస్ సంక్షేమ అజెండాతో ముందుకు రావడం. దాని ముందు టీడీపీ డెవలప్మెంట్ సరితూగలేకపోయింది. ఇక 2009 నాటికి బాబు కూడా సంక్షేమ మంత్రం పఠించినా వైఎస్సార్ ముందు తేలిపోయారు.
అలా ఉమ్మడి ఏపీలో మళ్లీ సీఎం కాలేకపోయారు. ఇక 2014లో విభజన ఏపీలో ఆయన ఉచిత పధకాలు హామీలతో అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన చెప్పినవి అన్నీ చేయలేకపోయారు. ముఖ్యంగా రైతు రుణాల మాఫీ వ్యవహారం కానీ డ్వాక్రా మహిళల రుణాల మాఫీ కానీ ఇతర కీలక హామీలు కానీ అమలు చేయలేదు.
దాంతో 2019లో దెబ్బ పడింది. నిజానికి 2014 నుంచి 2019 మధ్యలో బాబు ఏపీకి రాజధాని కావాలని ఆలోచించి ఆ దిశగానే అడుగులు వేశారు. ఆయన అమరావతి రాజధాని వస్తే కనుక ఏపీ మొత్తం బాగుపడుతుందని భావించేవారు కానీ జనాలకు అభివృద్ధి కంటే సంక్షేమం మీదనే మోజు ఉందని గ్రహించలేకపోయారు.
ఆనాడు జగన్ ఇచ్చిన అనేక ఉచిత హామీలను మెచ్చి 151 సీట్లతో ఆయనకు పట్టం కట్టారు. ఇక 2024 నాటికి బాబు కూడా అదే రూట్లోకి వెళ్ళారు. సూపర్ సిక్స్ అంటూ ఆయన ఊరూరా తిరిగి జనాలకు వాటిని చేరువ చేశారు. తాము అధికారంలోకి వస్తే రెట్టింపు ఉచితాలు ఇస్తామని కూడా ఊరించారు. దాంతో జనాలు అంతా కూటమి వైపు వచ్చేసి జై కొట్టారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క పించన్ పెంపు తప్ప మరేమీ అమలు కావడం లేదు. సూపర్ సిక్స్ అన్నది ఎక్కడో ఉండిపోయింది. దాని కి అయితే డబ్బులు లేవు. ఖజానా వెక్కిరిస్తోంది. ఇంకో వైపు చూస్తే అమరావతిని ఈసారి చాలా సీరియస్ గా బాబు తీసుకున్నారు. దాని కోసం నిధుల సేకరణ చేస్తున్నారు. తనకు ఇచ్చిన ఈ అయిదేళ్ల టెర్మ్ లో అమరావతి రాజధానిని పూర్తి చేసి చూపించాలని అనుకుంటున్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని తాను పూర్తి చేసి ఎనభయ్యేళ్ల ఆంధ్రుల కలను తీర్చిన వారిగా చరిత్రలో నిలవాలని చూస్తున్నారు. ఈ రెండూ చేస్తే కచ్చితంగా తనను 2029లో జనాలు ఆదరిస్తారు అన్నది బాబుకు ఉన్న గట్టి నమ్మకంగా చెబుతున్నారు.
అయితే బాబు అభివృద్ధి మంత్రం మళ్లీ టీడీపీని అధికారంలోకి తెస్తుందా అంటే దాని మీదనే చర్చ సాగుతోంది. జనాల మూడ్ గతంలోలా లేదు. వారిది వ్యక్తిగత అజెండాగా ఉంటోంది. పైపెచ్చు జగన్ అధికారంలోకి వచ్చాక అయిదేళ్ళ పాటు బటన్ నొక్కుతూ లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో నగదు బదిలీని డైరెక్ట్ గా చేసేవారు.
దాంతో అయిదేళ్ల కాలంలో సగటున ప్రతీ లబ్దిదారుని ఖాతాలో లక్ష నుంచి రెండు మూడు లక్షల దాకా పడ్డాయి. ఆ విధంగా వారిని పండుగలు పబ్బాలు అన్నీ దివ్యంగా సాగిపోయయి. ఇపుడు పెద్ద పండుగగా సంక్రాంతి వస్తోంది. అయినా కానీ బ్యాక్ ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదని లబ్దిదారులు అంటున్నారు.
ఇటీవల జనాలలోకి వస్తున్న కూటమి ప్రజా ప్రతినిధులను కూడా వారు ఇదే విషయం మీద నిలదీస్తున్నారు. ఏడు నెలలలోనే గ్రామీణ ప్రాంతాలలో ఈ రకమైన పరిస్థితి ఉంది. మరి రానున్న రోజులలో ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది.
ఉచిత పధకాలు ప్లస్ అభివృద్ధి అంటే సాధ్యం కాదు. జగన్ ఉచిత పధకాలు అమలు చేసి అభివృద్ధి మరచారు. దాంతో ఉన్నత వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఆయన పాలన మీద పూర్తి వ్యతిరేకతను పెంచుకున్నాయి. ఇక దిగువ వర్గాలు కూటమికి ఎందుకు ఓటు వేశాయి అంటే ఉచిత పధకాలను రెట్టింపు ఇస్తారని ఆశపడి అని విశ్లేషణలు ఉన్నాయి.
మరి ఈ ఉచితాలు అమలు చేయకుండా అభివృద్ధి అజెండాతో 2029 ఎన్నికలకు టీడీపీ వెళ్తే ఉన్నత మధ్యతరగతి వర్గాల ఓట్లు దండీగా పడవచ్చేమో కానీ రూరల్ సెక్టార్ నుంచి పేద వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండదన్న చర్చ కూడా ఉంది. ఎక్కువ సంఖ్యలో ఈ వర్గాలే ఉంటాయి కాబట్టి ఏదో విధంగా కూటమి సర్కార్ సర్దుబాటు చేసుకుని సంక్షేమం కూడా చూడాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
ఇక 2004 నాటికి చంద్రబాబు హైదరాబాద్ సహా కీలక ప్రాంతాలలో అభివృద్ధి చేశారు. పాలనను గాడిన పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలలో చక్కగా అన్ని పనులూ జరిగేలా చూసారు కానీ ఎందుకు ఓడారూ అంటే సంక్షేమంలో తేడా కొట్టబట్టే అన్నది ఒకటి ఉంది. మరి ఆ ట్రాక్ రికార్డుని చూసి అయినా చక్కదిద్దుకుంటారా అన్నదే ప్రశ్నగా ఉంది.