ఐదు ఎకరాల్లో సీఎం చంద్రబాబు ఇల్లు
దీంతో గత ఏడాది డిసెంబరులో స్థానిక రైతుల నుంచి ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు బుధవారం భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.;

రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్ కు సమీపంలో సుమారు ఐదు ఎకరాల స్థలంలో సీఎం చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న చంద్రబాబు కుటుంబం అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబరులో స్థానిక రైతుల నుంచి ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు బుధవారం భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.

రాజధాని అమరావతితోపాటు తన సొంత ఇంటిని నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక భాగాన ఈ9 రోడ్డుకు ఆనుకుని ఆయన సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. సుమారు ఐదు ఎకరాల స్థలంలో ఇల్లు కోసం 1,455 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. జీ ప్లస్ 1లో చంద్రబాబు ఇల్లు నిర్మించనున్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి, ఉండవిల్లిలోని అద్దె ఇంటి నుంచి ఇక్కడి షిఫ్టు అవ్వాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు.

బుధవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబుతోపాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించారు. కాగా, చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది. సొంత గ్రామం నారావారిపల్లెలో వారసత్వంగా వచ్చిన ఇంటితోపాటు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో మరో ఇంటిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారు. రాజధానిలో ఇప్పటివరకు సొంత ఇల్లు లేకపోవడంతో ప్రతిపక్షం ఆయనపై విమర్శలు చేసేది. మాజీ సీఎం జగన్ కు రాజధానిలో ఇల్లు ఉందని, సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారని ఆరోపించేది. అయితే ఇప్పుడు సొంత ఇంటిని నిర్మించుకోవడం ద్వారా వైసీపీ విమర్శలకు చంద్రబాబు చెక్ చెబుతున్నారని అంటున్నారు.