బాబుతో సహా 9మందికి ఎన్.ఎస్.జీ. సెక్యూరిటీ తొలగింపు... కారణం ఇదే!

ఇటీవల పార్లమెంట్ సెక్యూరిటీ విధుల నుంచి ఉపసంహరించుకోబడిన సీ.ఆర్.పీ.ఎఫ్.-వీఐపీ సెక్యూరిటీ వింగ్ ను ఈ ప్రముఖుల భద్రత కోసం వినియోగించనున్నారని అంటున్నారు.

Update: 2024-10-16 22:30 GMT

పలువురు వీవీఐపీలకు కేంద్రం ప్రత్యేకంగా కేటాయించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జీ) కమాండోల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... దేశవ్యాప్తంగా 9మంది వీవీఐపీలకు ఎన్.ఎస్.జీ. కమాండోలను విత్ డ్రా చేసుకుని వారి స్థానంలో సీ.ఆర్.పీ.ఎఫ్. కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

అవును... దేశవ్యాప్తంగా 9మంది వీవీఐపీలకు భద్రత కల్పించిన ఎన్.ఎస్.జీ. కమాండోలను విత్ డ్రా చేసుకోవాలని.. వారి స్థానంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన తాజా బెటాలియన్ ను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు.

ఇటీవల పార్లమెంట్ సెక్యూరిటీ విధుల నుంచి ఉపసంహరించుకోబడిన సీ.ఆర్.పీ.ఎఫ్.-వీఐపీ సెక్యూరిటీ వింగ్ ను ఈ ప్రముఖుల భద్రత కోసం వినియోగించనున్నారని అంటున్నారు. వాస్తవానికి దేశంలో ప్రస్తుతం 9 మంది వీవీఐపీలు ఎన్.ఎస్.జీ. "బ్లాక్ క్యాట్" కమాండోల భద్రతలో ఉన్నారు. ఇకపై వీరందరికీ సీ.ఆర్.పీ.ఎఫ్. తో భద్రత కల్పిస్తారు.

వాస్తవానికి యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహించే ఎన్.ఎస్.జీ. కమాండోలను ఇకపై పూర్తిగా ఆ పనులపైనే దృష్టిసారించేలా చేయడం కేంద్రం ప్లాన్ అని తెలుస్తోంది. వీరిని వీఐపీ భద్రత విధుల నుంచి తప్పించే ప్రణాళికను సిద్ధం చేసింది! ఈ నిర్ణయం అమలు అనంతరం.. సుమారు 450 మంది ఎన్.ఎస్.జీ. కమాండోలు భద్రతా బాధ్యతల నుంచి రిలీవ్ అవుతారు.

కాగా.. ప్రస్తుతం "జెడ్ ప్లస్" కేటగిరీ భద్రతలో ఉన్నవారిలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ మాజీ సీఎం మాయావతి, కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీనియర్ బీజేపీ నేత ఎల్.కే. అధ్వానీ, ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, కేంద్రం షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లా వంటి వారు ఉన్నారు.

మరోపక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్.ఎస్.జీ) 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News