చింతమనేని స్పీడ్ తగ్గించు.. చంద్రబాబు అసహనం

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-02-15 06:30 GMT

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోవద్దని మందలించారు. సహనంతో వ్యవహరించాలని హితబోధ చేశారు. ఇటీవల ఓ వివాహ వేడుకలో చింతమనేని కారుకు అడ్డంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు పెట్డడం.. అది తట్టుకోలేక చింతమనేని సహనం కోల్పోయి అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ పై దుర్భాషలాడిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.. దీనిపై వివరణ ఇచ్చేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే చింతమనేని కలిశారు.

దెందులూరులో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, సీఎం చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. నిరసన వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. అలా దుర్భాషలాడటం మంచి పద్ధతి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సహనంతో వ్యవహరించాలని సూచించారు. మీలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఎలా అంటూ అక్షింతలు వేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

దూకుడు రాజకీయానికి చిరునామాగా చింతమనేనిని చెబుతుంటారు. దెందులూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో ఫైర్ బ్రాండ్. ఆయన నోటి దురుసు వల్ల రాజకీయంగా హైలెట్ అవుతున్నా.. అంతకు మించి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనూ మిత్రపక్షాలతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజా వివాదంలో ఆయన కారుకు మాజీ ఎమ్మెల్యే కారు అడ్డుగా పెట్టారని ఆగ్రహంతో అబ్బయ్య చౌదరి డ్రైవర్ పై చిందులు తొక్కారు. చింతమనేని దుర్భాషలాడటాన్ని చిత్రీకరించిన వైసీపీ నేతలు.. ఆ వీడియోను వైరల్ చేశారు. చింతమనేనిపై చర్యలు తీసుకోరా? అంటూ సోషల్ మీడియాలో నిలదీశారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ సంఘటనలో తన తప్పు ఏం లేదని.. తనను కావాలనే రెచ్చగొట్టారని ఆరోపిస్తూ చింతమనేని తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తన కారుకు ఉన్న సీసీ టీవీ కెమెరా పుటేజ్ ను బయటపెట్టి కావాలనే తన కారుకు అడ్డంగా అబ్బయ్య చౌదరి కారు పెట్టారని, నేను ఆయనను బతిమాలి ముందుకు వెళ్లాలా? అంటూ ప్రశ్నించారు.

Tags:    

Similar News