పవన్, బాలయ్య గురించి బాబు మనసులో మాట
అయితే, విద్యార్థులు పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ గురించి చెప్పమని కోరడంతో, చంద్రబాబు వారి గురించి కూడా స్పందించారు.;

ఏపీలో ప్రస్తుతం అంతా కులాసాగా ఉంది. చంద్రబాబు, పవన్ లు జోడెద్దుల సవారీ సాఫీగా సాగిస్తున్నారు. పొత్తుధర్మం పాటిస్తూ రాగద్వేషాలు, పంతాలు పట్టింపులు లేకుండా పాలన బండి నడిపిస్తున్నారు. ప్రతీ వేదికపైన పవన్ తో బంధంపై చంద్రబాబుకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఈసారి పవన్ నే కాదు.. బాలయ్యను కూడా తీసుకొచ్చి ఐఐటీ మద్రాస్ విద్యార్థులు గోల చేశారు. దీంతో బాబు చేసిన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్రాస్‌లోని ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన ఒక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులు ఆయనను చూసి పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ సందర్భంగా చంద్రబాబు తెలుగులో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన ఆయన, పలు అంశాలపై వారిని ఉద్దేశించి మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వివరిస్తుండగా, సభికుల నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేరింతలు వినిపించాయి. విద్యార్థులు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పేర్లను గట్టిగా నినాదాలు చేశారు.
అయితే, విద్యార్థులు పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ గురించి చెప్పమని కోరడంతో, చంద్రబాబు వారి గురించి కూడా స్పందించారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో లేదా వేదికల వద్ద పెద్ద స్థాయి నాయకులు వేరే ప్రముఖుల గురించి మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ చంద్రబాబు విద్యార్థుల కోరిక మేరకు వారిద్దరినీ ప్రశంసించారు. "పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? బాలయ్య ఎలా ఉన్నారు?" అని విద్యార్థులు అడగడంతో, చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి "వారు సినిమాలతో పాటు ప్రజా జీవితంలో బిజీగా ఉన్నారు. కళ్యాణ్ - బాలకృష్ణ ఇద్దరూ చాలా బాగా చేస్తున్నారు. ఈ రాజకీయ ప్రముఖుల పట్ల ఇంత ఆసక్తి చూపుతున్నందుకు విద్యార్థులను అభినందిస్తున్నాను" అని బాబు అన్నారు." అని సమాధానమిచ్చారు. "మీరు ఎంత కష్టపడి చదివినా, ఎంత పెద్ద స్థానానికి చేరుకున్నా, సినిమాలు చూడటం మాత్రం మానరు. మీకున్న ఈ అభిమానాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని బాబు పేర్కొన్నారు. అంతేకాకుండా వారిద్దరూ స్ఫూర్తిదాయకమైన వ్యక్తులని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో విద్యార్థులు మరింతగా చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు, ఇతర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు వినిపించడం వారికి ఇష్టం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గొప్ప రాజనీతిజ్ఞుడు కావడం వల్ల, కళ్యాణ్ - బాలయ్యలను ఆయన గౌరవించే విధానం వల్ల, ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా విద్యార్థుల కేరింతలను సంతోషంగా అంగీకరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మద్రాస్ ఐఐటీలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ముఖ్యమైన అంశాలను ఆయన తన ప్రసంగంలో వివరించారు. అభివృద్ధి విద్యార్థుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. గతంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను కూడా ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. చంద్రబాబు ప్రసంగానికి విద్యార్థుల నుండి విశేషమైన స్పందన లభించింది.