బెజవాడ 'కమీషన్ రాజ్'.. ఎమ్మెల్యేకు సెగ .. !
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాన్ని నమ్ముకుని యువ ఎమ్మెల్యేలు పనులు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాన్ని నమ్ముకుని యువ ఎమ్మెల్యేలు పనులు చేస్తున్నారు. అయితే.. రెండో సారి మూడో సారి విజయం దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు మాత్రం.. తమ వ్యాపారాలు వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారు. దీనిపై ఇటీవల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తానని చెప్పింది కూడా ఇలాంటి వారిని ఉద్దేశించే కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే తీరుపు విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇదేసమయంలో ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ఆయన ఫైర్‌బ్రాండ్ ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప.. పనిచేయడం లేదన్న వాదన సొంత పార్టీ టీడీపీలోనేవినిపిస్తుండడం గమనార్హం. కార్పొరేటర్లకు కూడా ఆయన టార్గెట్లు పెట్టారని పార్టీ అధినేత వరకు ఫర్యాదులు అందాయి. దూకు డు మంచిదే అయినా.. ఆ దూకుడు వ్యక్తిగత లబ్ధి కోసం ప్రయత్నించడం ఆయనకు విమర్శలు తెచ్చేలా చేస్తోంది. ప్రతి పనిలోనూ కమీషన్ రాజ్ పనిచేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం సాగుతోంది. అలాగే విజయవాడలోనూ పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆయన కమీషన్ ఆరాటానికి కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారని టీడీపీలోనే చర్చలు జరుగుతున్నాయి. పని గురించి పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే.. కమీషన్ కోసమే ఆరాటపడుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇక, సాధారణ ప్రజలకు కూడా ఎమ్మెల్యే కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ప్రతి వారం మీతోనే ఉంటానంటూ.. నమ్మబలికిన సదరు నాయకుడు ఇప్పుడు అసలు ప్రజలను పట్టించుకోవడమే మానేశారు. వారి సమస్యలను ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించి.. తన వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని అంటున్నారు. ఇటీవల సొంతగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన దానికి పెట్టుబడులు కూడా.. కాంట్రాక్టర్ల నుంచిసేకరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ఆయన పనితీరు మార్చుకుంటే బెటర్ అని టీడీపీ నేతలు చెబుతుండడం గమనార్హం.