పార్ల‌మెంటులో 'ఏపీ గ‌ళం' వినిపిస్తోందా..!

ప్ర‌స్తుతం పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. కూట‌మి ప‌క్ష పార్టీలైన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల్లో.. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్ర‌బాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Update: 2024-12-01 17:30 GMT

ప్ర‌స్తుతం పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. కూట‌మి ప‌క్ష పార్టీలైన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల్లో.. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్ర‌బాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక‌, జ‌న‌సేన‌కు ఉన్న ఇద్ద‌రికీ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. పార్ల‌మెంటులో ఎలుగెత్తాల్సిన అంశాల‌ను కూడా ఆయ‌న విశ‌దీక‌రించారు. దీంతో ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌లు.. ముఖ్యంగా వైసీపీ అరాచ‌క పాల‌న‌, ఆర్థిక విధ్వంసాల‌ను లేవ‌నెత్తాల‌ని చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల‌కు సూచించారు.

ఇక‌, రాష్ట్రంలో వెనుక బ‌డిన జిల్లాలు, ఉపాధి హామీ నిధులు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల‌ను లేవ‌నెత్తి నిధులు స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని జ‌న‌సేన ఎంపీల‌కు ప‌వ‌న్ తేల్చి చెప్పారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఆయా ఎంపీలు.. ఏం చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతానికి అయితే.. టీడీపీ, జ‌న‌సేన ఎంపీల గ‌ళం లోక్‌స‌భ‌లో వినిపించ‌డం లేదు. ఇక‌, బీజేపీ ఎంపీలు ఆరుగురు ఉన్న‌ప్ప‌టికీ..వారు కేంద్ర నాయ‌క‌త్వం ఏం చెబితే అదే మాట్లాడ‌తారు.

ఇక‌, వైసీపీకి ఉన్న న‌లుగురు ఎంపీల‌కు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ఏం చెప్పారో.. ఏమో ఎవ‌రికీ తెలియ‌దు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న బెంగ‌ళూరులోనే ఉన్నారు. దీంతో న‌లుగురు ఎంపీలు కూడా.. పార్ల‌మెంటు లో ఏం చేయాల‌ని చెప్పారో బాహ్య ప్ర‌పంచానికి అయితే తెలియ‌దు. కానీ, న‌లుగురు ఎంపీలు మాత్రం అప్పుడప్పుడు స‌భ‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. కానీ, మౌనంగా ఉండిపోతున్నారు. ఎవ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఏదీ మాట్లాడ‌డం లేదు.

వాస్త‌వానికి టీడీపీ ఎంపీలు.. ముందు రోజు చెప్పిన దాని ప్ర‌కారం.. అదానీ-జ‌గ‌న్ వ్య‌వ‌హారాన్ని పార్ల‌మెంటులో లేవనెత్తాల్సి ఉంది. జ‌గ‌న్ అవినీతి, అక్ర‌మాలు అమెరికా వ‌ర‌కు పాకాయ‌ని, త‌ద్వారా రాష్ట్రం, దేశం ప‌రువు కూడా పోతోంద‌న్నారు. దీంతో వారు ఖ‌చ్చితంగా అదానీ-జ‌గ‌న్ వ్య‌వ‌హారాన్ని లేవ‌నెత్తుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అస‌లు ఏ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం లేదు. అయితే.. దీనికి మ‌రోకార‌ణం కూడా ఉంది. స‌భ‌లు స‌జావుగా సాగ‌డం లేదు. ప్రారంభించిన ప‌ది నిమిషాల్లోనే వాయిదా ప‌డుతున్నాయి. దీంతో పార్ల‌మెంటులో మ‌న గ‌ళం ఎక్క‌డా వినిపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News