అమరావతిలో చంద్రబాబు ఇల్లు.. ఎన్ని స్పెషల్స్ అంటే..
ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురంలో ఒక ఇల్లును నిర్మించుకుంటున్న చంద్రబాబు అమరావతిలో కూడా శాశ్వత నివాసం ఏర్పాటు ఉండాలని భావిస్తున్నారు;

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి అడ్రస్ మారబోతోంది. ప్రస్తుతం ఉండవల్లిలోని లింగమేని గెస్ట్ హౌస్ లో నివసిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో శాశ్వత నివాసం నిర్మించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ఐదు ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకోవాలని నిర్ణయించారు. నిర్మాణ పనులకు వచ్చేనెల 9న శంకుస్థాపన చేయాలని ఫిక్స్ చేశారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురంలో ఒక ఇల్లును నిర్మించుకుంటున్న చంద్రబాబు అమరావతిలో కూడా శాశ్వత నివాసం ఏర్పాటు ఉండాలని భావిస్తున్నారు.
రాజధాని అమరావతిని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడ తన కూడా విశాలమైన ఇల్లు ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో కొద్దికాలం క్రితం ఈ6 రోడ్డుకు ఆనుకుని ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ కు ఈ స్థలం కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఉండటం విశేషం. అమరావతికి తలమానికంగా చెబుతున్న ఐదు ఐకానిక్ టవర్లలో గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది. దీనికి సమీపంలోనే చంద్రబాబు కూడా అత్యాధునిక వసతులతో ఇల్లు నిర్మించుకోనున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం సచివాలయం ఉన్న వెలగపూడి రెవెన్యూ పరిధిలోనే చంద్రబాబు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ నూతన ఇంటిలో అందమైన గార్డెన్ తోపాటు భద్రతా సిబ్బంది నివాసాలు, పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు. మంత్రి కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు శుక్రవారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం నూతన గృహ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 9న శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా గృహ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చుతున్నారు. దీంతో త్వరలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అమరావతికి మారుతోందని చెబుతున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన స్వగ్రామం నారావారిపల్లిలో ఓ ఇల్లు ఉంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న నారావారిపల్లె ఇల్లుతోపాటు హైదరాబాద్ లోని మరో ఇల్లు ఉంది. చంద్రబాబు ఎక్కువగా ఈ ఇంటిలోనే నివసించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి చంద్రబాబు రాజధాని అమరావతి పరిధిలోని ఉండవిల్లిలో నివసిస్తున్న విషయం తెలిసిందే. లింగమేని గెస్ట్ హౌస్ ను లీజుకు తీసుకున్న చంద్రబాబు ప్రస్తుత అందులోనే ఉంటున్నారు. ఇప్పుడు రాజధానిలో నిర్మాణం పూర్తి చేస్తే ఆయన శాశ్వత చిరునామా అమరావతికి మారుతుందని అంటున్నారు.