పోలవరం బాబుకు వరం
ఎప్పటి పోలవరం. ఏనాటి పోలవరం కాలానికి చిన్న కావచ్చేమో కానీ పోలవరం అనే ఆలోచనకు వయసు అచ్చంగా 85 ఏళ్ళు పైమాటే.;

ఎప్పటి పోలవరం. ఏనాటి పోలవరం కాలానికి చిన్న కావచ్చేమో కానీ పోలవరం అనే ఆలోచనకు వయసు అచ్చంగా 85 ఏళ్ళు పైమాటే. 1940 ప్రాంతంలో పోలవరం ఆలోచన వచ్చింది. ఆనాడు బ్రిటిష్ వారి ఏలుబడి ఉంది. అప్పటికే కాటన్ దొర ఏపీలో జీవనదుల మీద ఆనకట్ట కట్టడానికి పూనుకున్నాడు.
గోదావరి డెల్టాకు సాగునీరు అందించడానికి కరవులను నివారించడానికి, బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో గోదావరి నదిపై దౌళేశ్వరం బ్యారేజీని నిర్మించారు. ఇదే భవిష్యత్తులో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గా మారింది.
అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్న పరిస్థితులను చూసిన వారు పోలవరం ప్రాజెక్ట్ కోసం ఆలోచనలు చేశారు. ఆ విధంగా చూస్తే కనుక 1940లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారని చరిత్ర చెబుతోంది. మొదట్లో దీని పేరు రామపాద సాగర్ అని పెట్టారు. ఆ రోజులలో దీని నిర్మాణానికి వేసిన అంచనా వ్యయం కేవలం 129 కోట్ల రూపాయలు.
ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపుతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడంగా నిర్ణయించారు. ఆ తరువాత బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదిలి వెళ్ళడం స్వాతంత్ర్యం రావడం ఆ మీదట ఉమ్మడి మద్రాస్ నుంచి ఏపీ విడిపోవడం ఆ విడిన ఏపీ ఆంధ్ర ప్రదేశ్ గా నాటి హైదరాబాద్ స్టేట్ తో కలసి ఆవిర్భవించడం అన్నీ జరిగిపోయాయి.
మళ్ళీ పోలవరం ప్రస్తావన ఎపుడు వచ్చింది అంటే 1980 ప్రాంతంలో ఆనాడు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ సీఎం టంగుటూరి అంజయ్య పోలవరం కోసం పునాది రాయి వేశారు. ఇక అది మళ్ళీ మరో పాతికేళ్ళ తరువాత ముందుకు కదిలింది. వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యాక 2004లో పోలవరం చకచకా కదిలింది. అన్ని అనుమతులూ ఆనాడు వచ్చాయి. కానీ నిర్మాణం పనులు అయితే పెద్దగా ఊపందుకోలేదు. ఈ లోగా వైఎస్సార్ మరణం, తెలంగాణా ఉద్యమంతో 2014 దాకా కాలం గడచిపోయింది.
ఇక విభజన ఏపీకి కేంద్రం పోలవరం వరంగా ప్రకటించింది. తామే పూర్తి చేసి ఇస్తామని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తొలి సీఎం అయిన చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు సాగాయి. ఇక 2019లో వైసీపీ హయాంలో అనుకున్న స్థాయిలో జరగలేదు అన్న విమర్శలు ఉన్నాయి.
ఇపుడు మళ్ళీ చూస్తే కనుక చంద్రబాబు సీఎం గా 2024లో అయ్యాక పోలవరం ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. గురువారం ఆయన పోలవరం సందర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. పోలవరం ఎనాడో పూర్తి కావాల్సి ఉందని గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే జాప్యం అయింది అన్నారు. 2019లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక పోలవరం పూర్తి చేసేవారమని కూడా అన్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే డయాఫ్రం వాల్ కొట్టుకుని పోయిందని అప్పట్లో నాలుగు వందల కోట్లతో నిర్మించామని ఇపుడు మళ్ళీ వేయి కోట్లు ప్రజా ధనం ఖర్చు అవుతోందని బాబు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్ ని 2027 నాటికి పూర్తి చేస్తామని బాబు చెప్పారు. పోలవరం ఏపీకి వరం అని ఆయన అన్నారు.
అయితే ఒక్కారి చరిత్ర చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని వైఎస్సార్ అనుకున్నారు. అంజయ్య పునాది రాయి వేశారు. వైఎస్సార్ వారసుడిగా జగన్ మాత్రమే పోలవరం చేయగలరని వైసీపీ నేతలు చెప్పారు. కానీ చివరికి చంద్రబాబుకే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే మహత్తరమైన అవకాశం దక్కింది అని చెప్పాల్సి ఉంది.
నిజంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కనుక బాబు చరిత్రలో నిలిచిపోతారు. వందేళ్ళ కలను ఆయన సాకారం చేసిన వారు అవుతారు. కోస్తాతో పాటు ఏపీకి పోలవరం వంటి అద్భుతాన్ని అందించిన వారు అవుతారు. బాబుకే పోలవరం పూర్తి చేయాలన్నది రాసి పెట్టి ఉంది అని అంటున్నారు. సో 2027లో పోలవరం పూర్తి జరుగుతుంది అని నిబ్బరంగా ఉండొచ్చు అంతా అని అంటున్నారు.