ఈ హెచ్చరిక మంచిదే `బాబూ` ..!
``ఎవరు ఏం చెప్పినా.. వింటాను!`` అని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. అయితే.. అందరూ ఆయనను, ఆయన పొగుడుతూ.. చెప్పేవారే ఉన్నారు;

``ఎవరు ఏం చెప్పినా.. వింటాను!`` అని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. అయితే.. అందరూ ఆయనను, ఆయన పొగుడుతూ.. చెప్పేవారే ఉన్నారు. చాలా చాలా బాగుంది.. అంటూ పాలనను భుజాల కు ఎత్తుకుని..చంద్రబాబును నెత్తిన పెట్టుకునే వారే కనిపిస్తున్నారు. అయితే.. కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవాలను ఉటంకిస్తూ.. అత్యంత స్వల్పంగా ఒకరిద్దరు మాత్రమే `హెచ్చరిక`లు చేస్తున్నారు. మరి వారు చేస్తున్న హెచ్చరికలను కూడా చంద్రబాబు వినాల్సి ఉంది.
తాజాగా మాజీ మంత్రి, టీడీపీ మాజీ సీనియర్ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా.. కొన్ని హెచ్చరిక లు చేశారు. మరి వీటిని చంద్రబాబు వింటారా? విని మార్చుకునే ప్రయత్నం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ శోభనాద్రీశ్వరరావు ఒకింత ఘాటుగానే ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని పాలసీలను వ్యతిరేకించారు. ఇది ఒకరకంగా.. చంద్రబాబుకు , కూటమి సర్కారుకు కూడా.. హెచ్చరిక వంటిదే. విని ఆచరిస్తే.. జగన్ మాదిరిగా ఒక్కసారికే కాకుండా.. మరిన్ని సంవత్సరాలు.. అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పలువురు మేధావులు చెబుతున్నారు.
శోభనాద్రీశ్వరరావు ఏమన్నారంటే..
పోలవరం -బనకచర్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, ఈ ప్రాజక్టుకు రూ.80.800 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని కూడా ఆయనే చెబుతున్నారు. దీనినే వడ్డే ప్రశ్నించారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడానికి 30 వేల కోట్లు ఉంటే సరిపోతాయి. ఆ సొమ్ములే లేక.. కేంద్రంపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బనకచర్ల అంటూ.. అక్కడి(కర్నూలు+సీమ) రైతులకు ఆశ పెడితే.. ఎలా ? అనేది ఆయన ప్రశ్న. ఇంత పెద్ద మొత్తం నిధులు ఎలా వస్తాయన్నది ఆయన నిలదీత. ఈ విషయాన్ని ఇక్కడితో సరిపుచ్చాలన్నది సూచన.
ఇక, విద్య, వైద్య రంగాల విషయంలో సర్కారు చేస్తున్న ప్రచారాన్ని కూడా వడ్డే ప్రశ్నించారు. దయచేసి ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం కల్పించండి అని ఆయన కోరారు. మన రాష్ట్రంలో విద్యను రెండు సంస్థలు ఎగరేసుకుపోయాయని పేర్కొన్నారు. దీనిని అడ్డుకుని ప్రభుత్వ రంగంలో వాటిని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఇక, జిల్లాకు ఒక విమానాశ్రయం అంటున్న చంద్రబాబు ప్రకటనను కూడా ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు ఇప్పటికీ ఉన్నది ఒక్క ఎయిర్ పోర్టు మాత్రమే నన్న వడ్డే.. ఏపీలో ఆరు ఎయిర్ పోర్టులున్నాయ్ ... ఇంకా ఎన్నిపెడతారు? అని ప్రశ్నించారు. దీనికి కోట్ల రూపాయలు ఖర్చుచేయడం కన్నా.. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు. సో.. ఇలా చాలానే చెప్పుకొచ్చారు. ఈ హెచ్చరికలు మంచివే. మరి చంద్రబాబు పాటిస్తారో లేదో చూడాలి.