రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు
ఇక చంద్రబాబు తన జీవితంలో రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న వారి రుణం ఒక్కొక్కరిది సమయం వచ్చినపుడు తీర్చుకుంటూనే ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుని భౌతిక వాది అని ఆయనకు ఎమోషన్స్ పెద్దగా పట్టవు అని ఒక దశలో ప్రచారం చేశారు. ఆయన 1995లో మొదటి సారి ఉమ్మడి ఏపీకి సీఎం అయిన తరువాత ఆయన పాలన మొత్తం పరుగులు పెట్టించారు. తర తమ భేదాలు చూడకుండా అందరి విషయంలో ఒకే విధానం అనుసరించారు. ఒక విధంగా ఉమ్మడి ఏపీని గాడిలో పెట్టారు.
ఆ సమయంలో చంద్రబాబుకు పనిమంతుడు అని పేరు వచ్చినా ఎవరినీ ఆయన పట్టించుకోరు అన్న విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో సొంత బావమరిది హరిక్రిష్ణ విభేదించి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అలాగే 2004 ఎన్నికలకు ముందు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కూడా అన్న బాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చారు.
అలా బాబు రాగద్వేషాలకు అతీతం అని ప్రచారం సాగింది. కానీ బాబులో అభిమానం నిండుగా ఎపుడూ ఉంది. ఆయన బయట పడరు అంతే. ఆయనలో భావోద్వేగాలను రాజకీయాలతో మిళితం చేయరంతే అని చెబుతారు. ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ని ఎంతో అభిమానిస్తారు. అలాగే తన బావమరిది హరికృష్ణ విషయంలోనూ బాబు చేయాల్సింది చేశారు.
ఇక చంద్రబాబు తన జీవితంలో రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న వారి రుణం ఒక్కొక్కరిది సమయం వచ్చినపుడు తీర్చుకుంటూనే ఉన్నారు. ఆయన తనను తొలిసారి సారి సీఎంగా చేయడంతో సాయపడిన పత్రికాధిపతి రామోజీరావు పాడె మోసి ఆయన రుణం అలా తీర్చుకున్నారు.
ఇపుడు చూస్తే తన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు పాడె మోసి అన్నగా చివరి సారి వీడ్కోలు పలికారు. ఆ విధంగా తమ్ముడి రుణం కూడా తీర్చుకున్నారు. తన ఎదుగుదలలోనే తమ్ముడు తన జీవితాన్ని చూసుకున్నారు అన్న సంగతి బాబు కంటే ఎవరికీ తెలియదు. రామ్మూర్తి నాయుడుకు పదవుల మీద మోజు లేదు, ఆయన తన అన్న ఉన్నతంగా ఉంటే చూడాలని అనుకున్నారు
అన్నకు తాను అసలైన తమ్ముడిగా ఉండాలని అనుకున్నారు. అందుకే అన్న సీఎం గా నాలుగు సార్లు గెలిచినా ఎక్కడా రామ్మూర్తి నాయుడు పదవుల కోసం క్యూ కట్టలేదని చెబుతారు. ఈ రోజులలో చూస్తే చాలా మంది తమ వారు ఎవరైనా పదవులలో ఉంటే వారి ద్వారా తామూ వెలిగిపోవాలని చూస్తారు. కానీ రామ్మూర్తి నాయుడు దానికి భిన్నం అని చెబుతారు
ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగానే ఉన్నారు. మొత్తం మీద చూస్తే బాబు తొలిదశ రాజకీయ జీవితం నుంచి తమ్ముడు అండగా నిలబడ్డారు. బాబు గెలుపులో ఓటమిలో ఉన్నారు. ఈ విధంగా తన వెంట నీడలా ఉన్న తమ్ముడు ఈ రోజు లేడు అంటే బాబు మనసు బాధతో ద్రవించింది. అందుకే తమ్ముడు పాడె మోసి ఆయన రుణం తీర్చుకున్నారు. తన తమ్ముడు ఆత్మ శాంతిని కోరుకుంటూ ఆయన ఘన నివాళిని అర్పించారు.
ప్రభుత్వ లాంచనాలతో తమ్ముడి అంతిమ యాత్రను ఘనంగా జరిపించి బాబు రామ్మూర్తి నాయుడుకు కడసారి వీడ్కోలు పలికారు. ఏడున్నర పదుల వయసులో బాబు తమ్ముడి పాడె మోస్తూ ముందుకు కదలడం చూసిన వారు అంతా అన్నగా బాబు ఎంతటి ఉన్నతంగా నిలిచారో అని తలచుకున్నారు. ఆ వయసులో ఎవరికీ రాని కష్టం బాబుకు వచ్చింది. అయినా దుఖాన్ని దిగమింగుకుని ఇంటికి పెద్దగా బాబు ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. ఇవన్నీ చూసిన వారు ఎవరైనా బాబుకు ఎమోషన్లు లేవని అనగలారా. బాబు లోతైన మనిషి. ఆయన గుండెలోనూ తడి ఉంది. అది చూసిన వారి కంటికే కనిపిస్తుంది.