చంద్రబాబు వర్సెస్ రేవంత్ @ దావోస్... ఎవరి బలం ఏమిటి?
దావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయలుదేరారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో మొదలు కానుంది. ఈ కార్యక్రమం ఈ నెల 24 వరకూ కొనసాగనుంది. ఈ సదస్సు కోసం ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, అనేక రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు బయలుదేరారు.
ఇందులో భాగంగా... విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని.. అక్కడ నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్ చేరుకుని.. సోమవారం ఉదయం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. మరోవైపు ఇప్పటికే సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... అక్కడ నుంచి దావోస్ కు బయలుదేరి వెళ్లారు.
అవును... దావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయలుదేరారు. ఈ సమయంలో ఎవరి ప్లానింగ్ లో వారు వెళ్లారు.. ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తేబోతున్నారు అనేది ఈ సమయంలో ఆసక్తిగా మారింది. ఈ విషయంలో బ్రాండ్ ఏపీ అని చంద్రబాబు వెళ్లగా.. రైజింగ్ తెలంగాణ అని రేవంత్ రెడ్డి బయలుదేరారు.
'బ్రాండ్' చంద్రబాబు 'ఏపీ'!:
ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ దిగ్గజాలు పాల్గొనే ఈ దావోస్ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేయనున్నారు. ఇందులో భాగంగా... సోమవారం జ్యూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం "మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా" పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు.
ఇదే సమయంలో... రెండో రోజు సీఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ అనంతరం సోలార్ ఇంపల్స్, ఎల్జీ, కోకాకోలా, వెల్ స్పన్, వాల్ మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్, సిస్కో మొదలైన సంస్థల ఛైర్మన్లు, సీఈవోలతో జరిగే సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. ఆ తర్వాత.. ఎనర్జీ ట్రాన్స్ మిషన్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు.
ఈ పర్యటనలో ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. తనకున్న అపార అనుభవాన్ని రంగరించి ఏపీకి కచ్చితంగా ఈ దఫా బలమైన పెట్టుబడులు సాధిస్తారని అంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి లోకేష్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఈడీబీ అధికారులు ఉన్నారు.
‘క్యాపిటల్యాండ్’ ఉత్సాహంలో రేవంత్ రైజింగ్!:
ఆదివారం వరకూ సింగపూర్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు ఓ భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడులకు "క్యాపిటల్యాండ్" కంపెనీ ముందుకొచ్చింది.. హైదరాబాద్ లో అత్యాధునిక ఐటీపార్కును ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్సాహంలోనే సింగపూర్ నుంచి దావోస్ బయలుదేరారు రేవంత్ రెడ్డి.
ఈ ఉత్సాహంలో దావోస్ లో మరింత సత్తా చాటే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ వంటి నగరాన్ని కలిగి ఉన్న రేవంత్ టీమ్... పెట్టుబడులకు గమ్యస్థానంగా భాగ్యనగరాన్ని పరిచయం చేసే భారీ లక్ష్యంతో ఈ పర్యటనలో పాల్గొంటోంది. రైజింగ్ తెలంగాణ పేరుతో ఇప్పటికే దావోస్ చేరిన రేవంత్ బృందం... ఏ రేంజ్ ఫలితాలు సాధిస్తాదనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా... అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతుందని అంటున్న వేళ.. పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ ఆ విధంగానే ముందుకు వెళ్లాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.