ప్రత్యేక విమానాల ఊసే లేని ప్రయాణం... తెలుగు సీఎంలపై ప్రశంసలు!

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళ్లే క్రమంలో.. జ్యూరిక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు.

Update: 2025-01-21 06:03 GMT

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రెవంత్ రెడ్డి ప్రయాణమై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోమవారం ఇద్దరూ జ్యూరిక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన పిక్ వైరల్ గా మారింది. మరోపక్క ప్రత్యేక విమానాల ప్రస్థావన లేని వీరి ప్రయాణంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

అవును... ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళ్లే క్రమంలో.. జ్యూరిక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఈ భేటీపై ట్వీట్ చేసిన రేవంత్... జ్యూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబును కలవడం సంతోషకరమని, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించామని తెలిపారు. దీనిపై చంద్రబాబు రీ ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... రెండు రాష్ట్రాలు.. ఒకటే స్పూర్తి.. తెలుగు సమాజం ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోవాలి. రేవంత్ రెడ్డిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జ్యూరిక్ నుంచి దావోస్ కు రేవంత్ రెడ్డి తన టీమ్ తో కలిసి ట్రైన్ లో ప్రయాణించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను రేవంత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవానికి.. దావోస్ పర్యటన, సింగపూర్ పర్యటన వంటి విదేశీ పర్యటనలకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో బయలుదేరి వెళ్తుంటారు! గతంలో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు తన టీమ్ ని తీసుకుని స్పెషల్ ఫ్లైట్స్ లోనే విదేశీ పర్యటనలు చేశారు! అయితే.. ఇప్పుడు బాబు కూడా ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం.

దావోస్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు సాధారణ విమానంలోనే విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లి.. అక్కడ నుంచి జ్యూరిచ్ కు చేరుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి తన టీమ్ తో కలిసి సింగపూర్ నుంచి జ్యూరిచ్ కి సాధారణ విమానంలోనే వెళ్లారు. అనంతరం.. తన కేబినెట్ మంత్రి, ఇతర అధికారులతో కలిసి జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైలులో ప్రయాణించారు.

ఈ సమయంలో... ఖర్చు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లున్నారని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల్లో అదనపు భారాలు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లున్నారని.. అందువల్లే ప్రత్యేక విమానాల్లో పర్యటనలు అనే ఆలోచన చేయలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.. నెటిజన్ల ప్రశంసలు అందుతున్నాయి!

Tags:    

Similar News