జనంలోకి చంద్రబాబు 'మనుషులు'.. విషయం ఏంటంటే..!
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఆరు మాసాలు అయిపోయింది. పాలన పరంగా దూకుడు బాగానే ఉంది.
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఆరు మాసాలు అయిపోయింది. పాలన పరంగా దూకుడు బాగానే ఉంది. కానీ, మంత్రులు, ఎమ్మెల్యేల పరంగా మాత్రం ఒకింత చంద్రబాబు విజన్ వెనుకబడిందనే చెప్పా లి. అంటే.. చంద్రబాబు పాలన.. విజన్ 2047 వంటివి ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒకింత గాబరా పడుతున్నారు. ఈ ఆరు మాసాల్లో ఏం చేశామని చెప్పేందుకు ఎమ్మెల్యేలను ఆయన ప్రోత్సహిస్తున్నా.. క్షేత్రస్తాయిలో మాత్రం ఎక్కడా ఎవరూ పెద్దగా స్పందించలేదు.
ఈ నేపథ్యంలో జనంలోకి చంద్రబాబు తన మనుషులను పంపించనున్నారు. అంటే.. ప్రభుత్వ పాలన.. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు వివరించనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు వరకు పార్టీకి ఐడియాలజీగా ఉన్న రాబిన్‌శర్మ.. బృందం వచ్చే నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరేందుకు రాబిన్ బృందం పనిచేసిన విషయం తెలిసిందే.
అనంతరం.. పొరుగు రాష్ట్రాల్లోనూ రాబిన్ బృందం ఇతర పార్టీలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరోసారి రాబిన్ శర్మ బృందాన్ని ఏపీకి ఆహ్వానించి.. ఇక్కడ వారి సేవలను మరోసారి వినియో గించుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. దీనిలో భాగంగానే జవనరి 15 తర్వాత.. రాబిన్ శర్మ టీం మరోసారి మంగళగిరిలోనే తిష్ఠవేయనుంది. ఐఐటీ, బీటెక్ చదివిన వారిని ఈ బృందం రిక్రూట్ చేసుకోనుంది. వీరికి 50 - 70 వేల వరకు వేతనాలు ఇవ్వనున్నారు.
ఈ యువకులు 25 నుంచి 40 మంది ఉండనున్నారని తెలిసింది. వీరంతా కూడా.. సీఎంవోలోను.. ఇతర పేషీల్లోనూ శిక్షణ తీసుకుంటారు. ప్రబుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాలపై చర్చించి.. తర్ఫీదు పొందుతారు. అనంతరం.. వీరిని జిల్లాకు ఒకరు చొప్పున నియమిస్తారు. వీరు సీఎం చంద్రబాబు విజన్ సహా పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తారు. తద్వారా సర్కారుపై వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు. మరి ఈ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.