సీఎం చంద్రబాబు భద్రతకు కౌంటర్ యాక్షన్ బృందాలు!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.

Update: 2025-01-08 06:46 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్జీ సెక్యూరిటీతో ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. అయితే ఈ బృందాలకు అదనంగా కౌంటర్ యాక్షన్ టీములను ఏర్పాటు చేశారు.

సీఎం చంద్రబాబు భద్రతలో సడన్గా మార్పులు చేయడం చర్చనీయాంశమైంది. మావోయిస్టుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న చంద్రబాబు కుట్టూ ఎప్పుడు సాయుధులైన కమెండోలు విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర పోలీసులతోపాటు సీఆర్ఫీఎఫ్ బృందాలు ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షిస్తుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేశారు. ప్రస్తుతం ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక బలగాలు మూడంచెల భద్రత విధులు నిర్వహిస్తుంటాయి. వీటికి అదనంగా ఇప్పుడు ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీం ఏర్పాటు చేశారు.

రాష్ట్ర పోలీసు విభాగమైన ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ టీంలోని కమాండోలకు శిక్షణ ఇస్తున్నారు. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద నక్సల్స్ దాడి తర్వాత చంద్రబాబుకు శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ కల్పించారు. ఇక గత ఐదేళ్లలో చంద్రబాబుపై దాడులు జరిగిన ప్రతి సమయంలోనూ ఆయన సెక్యూరిటీ బృందాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపేవి. దీంతో ఎప్పటికప్పుడు చంద్రబాబు భద్రతను కేంద్రం పెంచుతూ వచ్చింది. గతంలో చంద్రబాబు సెక్యూరిటీలో ఆరుగురు బ్లాక్ క్యాట్ కమాండోలు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య 12కు చేరింది. వీరికి అదనంగా ప్రస్తుతం కౌంటర్ యాక్షన్ టీం ప్రవేశపెట్టారు.

చంద్రబాబుపై దాడి చేయడానికి వచ్చిన వారిని, ఆయనకు అపాయం తలపెట్టడానికి వచ్చిన వారిని ఎదుర్కోవడమే కౌంటర్ యాక్షన్ టీంల విధి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ బృందాలు విపత్కర సమయంలో చంద్రబాబును సేఫ్ గా చూసుకోడానికి ప్రాధాన్యమిస్తాయి. కానీ, కౌంటర్ యాక్షన్ టీంలు మాత్రం ఎవరైనా అగంతకులు చంద్రబాబు భద్రతను ఛేదించుకుని వస్తే వారిని నిలువరించడానికి ప్రాధాన్యమిస్తాయి. అవసరమైతే అలాంటివారిని తుదముట్టించడానికి కూడా వీరికి పవర్స్ ఇచ్చారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపునకు చెందిన ఈ కమాండోలు విదేశాలతోపాటు దేశంలో అత్యుత్తమ శిక్షణ కేంద్రాల్లో రాటుదేలారు. వారం రోజుల నుంచి చంద్రబాబు భద్రతా విధుల్లో వీరుపనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. నలుపు రంగు చొక్కా, ముదురు గోధుమ రంగు ప్యాంటును ధరిస్తారు. వీరి షర్ట్ ముందు, వెనుక ఎస్ఎస్జీ అనే ఇంగ్లీషు అక్షరాలు ఉంటాయి.

Tags:    

Similar News