జేసీ ఫ్యామిలీకి బాబు మార్క్ క్లాస్ ?

మరి ఈ విషయంలో బాబు ఇచ్చిన క్లాస్ తో అంతా సర్దుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Update: 2024-12-01 22:30 GMT

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి ఎదురు లేదు ఆ ఫ్యామిలీ గత యాభై ఏళ్ళుగా రాజకీయం చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే జేసీ దివాకర్ రెడ్డి క్రియా శీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి చురుకుగా ఉన్నారు. ఆయన వైసీపీ అయిదేళ్ళ పాలనలో కూడా తన నిరసన గళం వినిపించి గట్టిగా నిలబడ్డారు

ఏపీ అంతా అన్ని మున్సిపాలిటీలు వైసీపీ గెలుచుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీ గెలుచుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా నెగ్గారు. ఎమ్మెల్యే చేసిన వారు మళ్ళీ కిందకు రావడం ఏంటి అంటే ఆయన ఆవన్నీ పట్టించుకోలేదు. తాడిపత్రికి గుండెకాయ లాంటి మున్సిపాలిటీ గెలుచుకోవడమే రేపటి తాడిపత్రి విజయానికి నాంది అని వ్యూహరచన చేశారు. 2024 ఎన్నికల్లో అదే జరిగింది.

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలం అయినా జేసీ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఆయన సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అపుడపుడు స్టేట్మెంట్స్ ఇస్తూ పోతున్నారు. వాటి సంగతి పక్కన పెడితే ఇటీవల బూడిద వాటా విషయంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో జేసీ ప్రభకరరెడ్డికి లడాయి ఏర్పాడింది. దాంతో ఇద్దరూ విమర్శలు చేసుకున్నారు

ఈ ఇష్యూ స్టేట్ లెవెల్ లో హాట్ టాపిక్ అయింది. దీంతో చంద్రబాబు ఇద్దరినీ పిలిచి సర్ది చెప్పాలనుకుంటే జేసీ గైర్ హాజరు అయ్యారు. ఇక పెన్షన్ల పంపిణీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అనంతపురం జిల్లాకు వస్తే జేసీ ఆయనకు స్వాగతం పలికేందుకు రాలేదు. అయితే తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు జేసీ అస్మిత్ రెడ్డిని పక్కకు పిలిచి క్లాస్ తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. కడపలో ఉన్న ఆర్టీపీపీ ఫ్లైయాష్ కాంట్రాక్టును తనకే కావాలని జేసీ ఫ్యామిలీ పట్టుబట్టడంతో పాటు లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడితే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు అని అంటున్నారు.

ఆయన జేసీ అస్మిత్ రెడ్డిని విమానాశ్రయంలోనే పక్కకు తీసుకెళ్ళి చెప్పాల్సింది కటువుగానే చెప్పారని అంటున్నారు. పార్టీలో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవద్దు అని క్లాస్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. బూడిద తరలింపు వ్యవహారంలో ఇలా రోడ్డున పడితే పార్టీ పరువు ఏమి కావాలని ఆయన ప్రశ్నించినట్లుగా తెలిసింది. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కడపలోని ఆర్టీపీపీ ఫ్లై యాష్ తరలింపు కాంట్రాక్టు విషయంలోనే జేసీ ఫ్యామిలీకి ఆదినారాయణరెడ్డికి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఈ కాంట్రాక్ట్ తమకే కావాలంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇద్దరూ గట్టిగా కోరుకుంటున్నారు. అంతే కాదు తాను ఏకంగా కడపకే వస్తాను అని . జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ విషయలోనూ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుులు తలెత్తాయి

దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో బాబు ఇచ్చిన క్లాస్ తో అంతా సర్దుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జేసీ ఫ్యామిలీ దూకుడు చేయడం మాత్రం అధినాయకత్వానికి ఆగ్రహంగానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News