కాళ్లకు నమస్కారం చేసిన వ్యక్తికి చంద్రబాబు షాక్

రాజధాని సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లను ఒక వ్యక్తి నమస్కరించారు.

Update: 2024-10-20 08:08 GMT

మాటలు చెప్పటం కాదు. చేతల్లోనూ అదే తీరును ప్రదర్శించటం చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. అందునా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. తాను చెప్పిన మాటల్ని పాటించాలన్న రూలేం లేదు. మాట వరసకు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వొచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతాన్ని పక్కన పెడితే.. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన వ్యవహారశైలిలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

తెలుగురాష్ట్రాల్లోని గత ముఖ్యమంత్రుల్ని చూస్తే.. తమకు పార్టీ నేతలు మొదలు అధికారుల వరకు ఎవరైనా సరే కాళ్లకు నమస్కారం చేయటాన్ని ప్రోత్సహించేవారు. వినయ విధేయతలకు అదో కొలమానంగా భావించేవారు. కానీ.. చంద్రబాబు మాత్రం ఆ తీరును అస్సలు ప్రోత్సహించటం లేదు. తన కాళ్లను మొక్కే ప్రయత్నం చేసే వారిని నిలువరిస్తున్నారు. మీరు తల్లిదండ్రులు.. గురువుల కాళ్లకు మాత్రమే నమస్కారం చేయాలి. ఇంకెవరి కాళ్లకు నమస్కారం చేయొద్దని గట్టిగా చెబుతున్నారు.

అయినప్పటికీ కొందరు తమకున్న ప్రేమాభిమానాల్ని.. భక్తిని ప్రదర్శించేందుకు.. వినయాన్నిచూపేందుకు కాళ్లకు నమస్కారం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఎవరూ ఊహించని రీతిలో రియాక్టు కావటం ద్వారా దిమ్మ తిరిగే షాకిచ్చారు చంద్రబాబు. రాజధాని సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లను ఒక వ్యక్తి నమస్కరించారు.

దానికి ప్రతి స్పందనగా చంద్రబాబు సైతం కాస్త వంగి ఆ వ్యక్తి కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నన్ను కూడా మీ కాళ్లకు నమస్కారం చేయమంటారా? అనటంతో సదరు వ్యక్తి కంగుతిన్నారు. మాటలే కాదు.. నిజంగానే చంద్రబాబు కాస్త వంగి కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేయటంతో ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంగా కాళ్లకు నమస్కారం కేవలం తల్లిదండ్రులకు.. గురువులకు మాత్రమే చేయాలని మరోసారి స్ఫష్టం చేశారు.

Tags:    

Similar News